Advertisement
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. మునుగోడు ఉప ఎన్నిక టెన్షన్ తొలగిపోవడంతో కొన్నాళ్లు నేషనల్ పాలిటిక్స్ పైనే ఆయన ఫోకస్ పెడతారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం ఢిల్లీకి వెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది. అక్కడ పలు పార్టీల నేతలతో భేటీలు ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ కు మద్దతును కూడగట్టేందుకు కేసీఆర్ హస్తినకు వెళ్తున్నట్టుగా వివరిస్తున్నాయి. అయితే.. ప్రధాని మోడీ తెలంగాణ టూర్ సమయంలోనే కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.
Advertisement
మోడీ 12న తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఈ టూర్ కు దూరంగా ఉండేందుకే కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారనే చర్చ జోరందుకుంది. కొందరు బీజేపీ నేతలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ విమర్శలు కూడా చేశారు. ప్రధాని కార్యక్రమానికి దూరంగా ఉండేందుకే కేసీఆర్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని ఆరోపించారు. కొన్నాళ్ల క్రితం కేంద్రంపై కయ్యానికి కాలు దువ్వారు కేసీఆర్. అప్పుటి నుంచి ప్రధాని ఎప్పుడొచ్చినా ఎదురుపడింది లేదు. ఈ క్రమంలోనే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ బాగా పెరిగింది.
Advertisement
కేసీఆర్ టూర్ కు దూరంగా ఉండాలని ముందే డిసైడ్ అయినా.. సాకుగా ప్రోటోకాల్ అంశాన్ని తెరపైకి తెచ్చారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. మోడీ టూర్ సందర్భంగా ప్రోటోకాల్ విషయంలో వివాదం చెలరేగింది. సీఎం కేసీఆర్ ను ఆహ్వానించలేదంటూ టీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. ఆహ్వానంలో కనీస ప్రొటోకాల్ పాటించకుండా తెలంగాణ ప్రజలను మోడీ సర్కార్ అవమానించిందని మండిపడింది. దీనిపై బీజేపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. మోడీ పర్యటనపై విమర్శలు చేయటం సిగ్గుచేటు అంటూ ఎటాక్ చేశారు. ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి కేసీఆర్ ను ఆహ్వానించలేదన్న టీఆర్‌ఎస్ వాదనను కేంద్రం ఖండించింది. ముఖ్యమంత్రిని ఆహ్వానించామని స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎం ముఖ్య కార్యదర్శికి ఎరువుల ఫ్యాక్టరీ సీఈవో లేఖ అందజేశారని వెల్లడించింది.
దీనిపై చర్చ సాగుతుండగానే సడెన్ గా కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నట్టు ప్రచారం సాగుతోంది. వచ్చే నెల ఢిల్లీలో రైతులతో భారీ ఎత్తున సభ నిర్వహించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా టీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఆ ఏర్పాట్లతో పాటు బీఆర్ఎస్ కి మద్దతు కోసం పలు పార్టీల నేతలను కలవడం కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని అంటున్నారు గులాబీలు. నాలుగు రోజులు అక్కడే ఉండి ఆ పనులన్ని చూసుకోబోతున్నట్టు చెబుతున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేల కొనుగోలు విషయాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్లి బీజేపీని టార్గెట్ చేయాలని భావిస్తున్నారట.