Advertisement
ఈసీ నుంచి బీఆర్ఎస్ కు గ్రీన్ సిగ్నల్ రావడంతో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ స్పీడ్ పెంచారు. మే నెలలో జరిగే కర్ణాటక ఎన్నికలపై దృష్టి సారించిన ఆయన.. జేడీఎస్ తో కలిసి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. అలాగే.. ఏపీపైనా ఫోకస్ పెట్టిన కేసీఆర్.. రేపోమాపో అక్కడ పార్టీ ఆఫీస్ పనులు ప్రారంభం చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 14న బీఆర్ఎస్ ఆఫీస్ ను స్టార్ చేస్తున్నారు.
Advertisement
సోమవారం ఆయన ఢిల్లీకి పయనం కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముందుగానే మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ కార్యాలయం ప్రారంభ పనులను చూసుకోవడానికి హస్తిన వెళ్లారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు అందాయి. దేశ రాజకీయాల్లో కొత్త రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భించిన నేపథ్యంలో.. హస్తిన కేంద్రంగా కేసీఆర్ కేంద్రానికి సవాల్ చేయనున్నారు.
Advertisement
బీఆర్ఎస్ జాతీయ విధానానికి సంబంధించి పలువురితో కేసీఆర్ మంతనాలు జరిపే అవకాశం ఉంది. వారితో చర్చించిన అనంతరం… పార్టీ జాతీయ విధానాన్ని ప్రకటిస్తారని సమాచారం. పలు రాజకీయ పార్టీ నేతలతో పాటు పలు రంగాలకు చెందిన వారితో చర్చలు ఉంటాయని అంటున్నారు. ఢిల్లీ ఎర్రకోటపై గులాబీ జెండాను ఎగరేస్తామన్న కేసీఆర్.. 14న ఢిల్లీ సర్దార్ పటేల్ మార్గ్ లోని భారత్ రాష్ట్ర సమితి జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. త్వరలోనే జాతీయ కార్యవర్గం ఏర్పాటు.. కార్యదర్శుల నియామకంపై ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం.
కేంద్ర రాజకీయాల్లో శూన్యత ఉందన్న టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ జాతీయ పార్టీ మరొకటి లేదు. ప్రాంతీయపార్టీలు కొన్ని జాతీయ పార్టీగా మారాలని ప్రయత్నించినా ఆ స్థాయిని అందుకోలేకపోయాయి. ఇప్పుడు దక్షిణాదిన తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్ ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయ జాతీయపార్టీగా ఎదుగుతుందా అన్నది ఆసక్తికంగా మారింది. ఇప్పటికే కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్.. ఓ అడుగు ముందుకే ఉంది. ఆ పార్టీ ఒక్కో రాష్ట్రంలో పోటీ చేస్తూ.. ఓట్లు, సీట్లు పెంచుకుని జాతీయ పార్టీ హోదాకు దగ్గరైంది. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పార్టీ పెట్టిన పదేళ్లకు ఆప్ జాతీయ హోదాకు దగ్గరైంది. మరి.. బీఆర్ఎస్ ఎప్పటికి చేరుతుందో అనే ఉత్కంఠ అందరిలో ఉంది.