Advertisement
దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు సీఎం కేసీఆర్. కొత్తగా నిర్మిస్తున్న సెక్రటేరియట్ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. హైదరాబాద్ నడిబొడ్డున ప్రభుత్వం నూతన సచివాలయాన్ని నిర్మిస్తోంది.
Advertisement
సచివాలయం ప్రధాన ద్వారం నుంచి మొదలుకొని చివరి అంతస్తు వరకు అన్ని పనులను పరిశీలించిన కేసీఆర్.. గత వందేండ్లలో ఇంత భారీగా ధోల్ పూర్ స్టోన్ ను వాడిన కట్టడం లేదని గుర్తు చేశారు. మరే రాష్ట్రంలోనూ ఇంతటి స్థాయిలో సచివాలయ నిర్మాణం జరగలేదని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సచివాలయం నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. అంబేద్కర్ పేరును సార్థకం చేసేలా, ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ఈ నిర్మాణం ఉందన్నారు.
Advertisement
సచివాలయానికి ఎదురుగా అమరవీరుల స్థూపం, పక్కనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు సీఎం. సచివాలయానికి రావడానికి ముందు సీఎం ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో రోడ్ల పరిస్థితిపై సమీక్షించారు. ఆయన వెంట మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డితో పాటు పలువురు నేతలు, అధికారులు ఉన్నారు.
ఇక సచివాలయంపై అద్భుతమైన ఫోటోను ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. నూతన సచివాలయం అందంగా రూపుదిద్దుకుంటోందని అన్నారు. కొద్ది నెలల్లోనే ప్రారంభిస్తామని.. దీనికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రూ.617 కోట్లతో నిర్మితమవుతున్న ఈ భవనాన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పద్ధతిలో నిర్మిస్తున్నారు.