Advertisement
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముందుగా అనుకున్న కార్యక్రమాలు ఉన్నాయని డేట్ మార్చాలని ఆమె రిక్వెస్ట్ లెటర్ పంపారు. అయితే.. కేసీఆర్ ను కలవకుండానే కవిత ఢిల్లీ పయనం కావడంపై అనేక రకాల వార్తలు వస్తున్నాయి. గతంలో సీబీఐ విచారణ సందర్భంగా ప్రగతి భవన్ కు పదే పదే వెళ్లారు కవిత. ఇప్పుడు కూడా కేసీఆర్ ను కలిసేందుకు వెళ్తారని ప్రచారం సాగింది. కానీ, అది జరగలేదు.
Advertisement
దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని చెప్పిన కవిత.. లాయర్స్ తో చర్చలు జరిపి డేట్ మార్పునకు ఈడీకి రిక్వెస్ట్ చేశారు. తర్వాత బంజారాహిల్స్ లోని ఇంట్లో నుంచి బయటకు వచ్చి నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అయితే.. కేసీఆర్ తో ఫోన్ లోనే కవిత చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. దాదాపు 15 నిమిషాల పాటు కేసీఆర్.. కవితకు ధైర్యం చెప్పారట.
Advertisement
భయపడకు బిడ్డ అంటూ కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతోనే ఆమె ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారని అంటున్నారు. ‘‘ఈడీ నోటీసులపై ఆందోళన పడకు. ధైర్యంగా ఢిల్లీకి వెళ్లు. నువ్వు చేపట్టిన నీ కార్యక్రమం కొనసాగించు. అనుకున్న కార్యక్రమాలన్నీ విజయవంతం అయ్యేలా చూడు. న్యాయపరంగా బీజేపీ ఆకృత్యాలపై పోరాడుదాం. బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా నీకు అండగా ఉంటుంది’’ అని కేసీఆర్ హామీ ఇచ్చారని చెబుతున్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలతో కలిసి భారత జాగృతి 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేయనుంది. ఈ దీక్షను కవితనే దగ్గరుండి చూస్తున్నారు. ఈ దీక్ష గురించి వారం క్రితమే ఆమె ప్రకటన చేశారు. అయితే.. అనూహ్యంగా ఒకరోజు ముందు ఈడీ విచారణకు పిలవడంపై రచ్చ మొదలైంది. 9, 10 విచారణకు రాలేనని.. 15న తారీఖున హాజరవుతానని ఆమె లేఖ రాశారు. ఇటు బీఆర్ఎస్ నేతలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.