Advertisement
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రామేశ్వరంలో ప్రారంభమైన ఈ యాత్ర.. త్వరలో జమ్మూకశ్మీర్ లో ముగియనుంది. ఇప్పటికే కశ్మీర్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్.. యాత్రను కొనసాగిస్తున్నారు. అయితే.. ఏదో ఒక రూపంలో అడ్డంకులు తప్పడం లేదు. వర్షం కారణంగా రెండు రోజులు బ్రేక్ ఇచ్చి శుక్రవారం ఉదయం యాత్రను ప్రారంభించారు. కానీ, ఇది అర్ధాంతరంగా ఆగిపోవాల్సి వచ్చింది.
Advertisement
శుక్రవారం యాత్రలో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి ఆయన కొంత దూరం నడిచారు. అచ్చం రాహుల్ గాంధీలా టీషర్ట్ ధరించి పాల్గొన్నారు. అయితే.. కాసేపటికే చలికి తట్టుకోలేక జాకెట్ ధరించారు. ఎముకలు కొరికే చలిలోనూ రాహుల్ గాంధీ టీ షర్ట్ వేసుకునే పాదయాత్ర చేస్తున్నారు. ఓవైపు చలి వణికిస్తున్నా ఆయన ఉత్సాహంగా ముందుకు వెళుతున్నారు. రాంబన్ జిల్లాలోని బనిహాల్ రైల్వేస్టేషన్ నుంచి కొంతదూరం ఒమర్ అబ్దుల్లా పాదయాత్రలో పాల్గొన్నారు.
Advertisement
అయితే.. షెడ్యూల్ ప్రకారం జోడో యాత్రలో భాగంగా కశ్మీర్ లోయలో 20 కిలోమీటర్లు రాహుల్ పాదయాత్ర జరపాల్సి ఉండగా. బనిహాల్ లో నడక మొదలుపెట్టి కిలోమీటర్ వరకూ సజావుగా సాగింది. కానీ, సడెన్ గా రాహుల్ కు భద్రత ఉపసంహరించారని, దాంతో యాత్ర అర్ధాంతరంగా నిలిపేయాల్సి వచ్చిందని కాంగ్రెస్ ప్రకటించింది. రాహుల్ కు కల్పిస్తున్న భద్రతను ఒక్కసారిగా ఉపసంహరించడంతో జనం ఆయనపైకి దూసుకువచ్చారని, దీంతో యాత్ర విరమించుకుని ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపింది.
పోలీసుల భద్రతా లోపం వల్లే యాత్ర ఆపేయాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే.. యాత్రలో ఎలాంటి భద్రతా లోపాలు లేవని పోలీసులు తెలిపారు. బనిహాల్ నుంచి ఇంతపెద్ద సంఖ్యలో జనం వస్తారని నిర్వాహకులు తమకు చెప్పలేదని జమ్మూకశ్మీర్ పోలీసులు వివరణ ఇచ్చారు. తమకు చెప్పకుండానే యాత్రను ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.