Advertisement
ఈసారి జీ-20 దేశాల సమావేశానికి ఇండోనేషియా ఆతిథ్యం అందిస్తోంది. నవంబర్ లో బాలీలో ఈ కార్యక్రమం జరగనుంది. భారత్ తో సహా మొత్తం 20 దేశాలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. అయితే.. 2023 సెప్టెంబర్ లో జరగబోయే జీ-20 దేశాల సదస్సుకు భారత్ వేదిక కానుంది. ఇది అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన సదస్సు. జీ-20 గ్రూపుగా ఏర్పడ్డ దేశాలు అత్యంత శక్తివంతమైనవి. ఇవి ప్రపంచ జీడీపీలో 85 శాతం వాటా కలిగి ఉన్నాయి.
Advertisement
వచ్చే ఏడాది ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న జీ-20 సదస్సుకు సంబంధించిన లోగోను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఆవిష్కరించారు. లోగోతోపాటు థీమ్, వెబ్ సైట్ ను మోడీ ఆవిష్కరించారు. భారతీయత ప్రతిబింబించేలా ఈ లోగో రూపొందింది. అయితే.. ఈ లోగోపై వివాదం నడుస్తోంది. ఇందులో బీజేపీ జెండా రంగులు, కమలం గుర్తు ఉండడంపై కాంగ్రెస్ అభ్యంతరం చెబుతోంది.
Advertisement
గతంలో ఇలాంటి చర్యను భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తిరస్కరించారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ గుర్తు చేశారు. 70 ఏండ్ల కిందట కాంగ్రెస్ జెండాను జాతీయ జెండాగా చేయాలనే ప్రతిపాదనను నెహ్రూ తిరస్కరించారని పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు జీ-20 అధ్యక్ష పదవికి బీజేపీ ఎన్నికల గుర్తు అధికారిక చిహ్నంగా మారిందని ఫైరయ్యారు. ప్రధాని మోడీ, బీజేపీ నేతలు సిగ్గు లేకుండా తమను ప్రమోట్ చేసుకునే ఏ అవకాశాన్ని వదులుకోరని దీంతో అర్థమౌతోందని సెటైర్లు వేశారు జైరాం రమేష్.
మరోవైపు బీజేపీ మాత్రం తన చర్యను సమర్థించుకుంది. ఆపార్టీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల్ ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ పేరు నుంచి కమల్ ను తీసివేస్తారా? అని ప్రశ్నించారు. కమలం మన జాతీయ పుష్పమని, అంతేగాక లక్ష్మీదేవి ఆసనమని వివరించారు. అలాంటి కమలాన్ని మీరు వ్యతిరేకిస్తారా? అని ట్వీట్ చేశారు.