Advertisement
పొత్తు విషయంలో ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. కాంగ్రెస్ లోని రేవంత్ వర్గం ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. ఇలాంటి సమయంలో టీపీసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రేని ఆయన కలవడం ప్రాధాన్యత ఏర్పడింది. ఏం జరుగుతుందా? అని అంతా ఉత్కంఠగా చూస్తుండగా.. అంతా తూచ్ అనేశారు థాక్రే. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
Advertisement
వెంకట్ రెడ్డి తనను రెండుసార్లు కలిశారని.. తను వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణలో ఇతర పార్టీలతో పొత్తులు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా గెలిచే సత్తా ఉందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ తో పొత్తులు ఉండవని పునరుద్ఘాటించారు. నాయకులు అంతా ఐక్యంగానే ఉన్నారని, కలిసికట్టుగా పని చేస్తారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 28 నుంచి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో యాత్ర చేస్తారని వివరించారు.
Advertisement
అంతకుముందు.. కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలనే దానిపై చర్చించామని వివరించారు. ముందస్తుగా టికెట్లు ఇవ్వాలని కోరానని చెప్పారు. ఆలస్యంగా ప్రకటించడం వల్ల గతంలో గొడవలు జరిగాయని వివరించినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని చెప్పానని వెల్లడించారు. ఇక వివాదాస్పదమైన తన వ్యాఖ్యలపై చర్చ జరగలేదని తెలిపారు.
తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా ప్రచారం చేశారని మండిపడ్డారు కోమటిరెడ్డి. వీటిని థాక్రే పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు. ఇంకొంచెం కష్టపడితే 60 సీట్లు వస్తాయని చెప్పానని.. పార్టీని గెలిపించే విషయంపై గంటన్నరసేపు చర్చించామని అన్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని కోరానని వివరించారు. ఈ నెలాఖరులో భువనగిరి నుంచి తాను పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు కోమటిరెడ్డి.