Advertisement
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ కు కేసీఆర్ 25 కోట్లు ఇచ్చారన్న వ్యాఖ్యలపై హస్తం నేతలు భగ్గుమంటున్నారు. ఈటలను టార్గెట్ చేస్తూ కౌంటర్ దాడి చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి దీనిపై స్పందిస్తూ.. భాగ్యలక్ష్మి ఆలయానికి రండి తేల్చుకుందామని సవాల్ చేశారు. దమ్ముంటే ఈటల రావాలన్నారు.
Advertisement
చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర తమ నాయకుడు రేవంత్ రెడ్డి ప్రమాణం చేయడానికి సిద్దం.. ఈటల కూడా రెడీనా అంటూ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ ఛాలెంజ్ చేశారు. బీజేపీ మెప్పు కోసమే ఈటల కాంగ్రెస్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఇలా దిగజారి రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కేవలం రాజకీయ లబ్ధికోసమే ఇలా మాట్లాడుతున్నారని ఇతర కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు.
Advertisement
ఈటల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు వీహెచ్, అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఆయన దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. అది నిజం కాదు కాబట్టే రేవంత్ ప్రమాణం చేస్తానని చెప్పారని.. ప్రధాని మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదని విమర్శించారు. ఈటల పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని వీహెచ్ ఫైర్ అవ్వగా.. బీజేపీలో ఆయన్ను చీపురు పుల్లలా చూస్తున్నారని… అందుకే ఇలా మాట్లాడుతున్నారని అద్దంకి ఎద్దేవ చేశారు.
మొత్తంగా ఈటల వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు ఇదే అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి స్పందించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో రేవంత్ రెడ్డికి ఈటల రూ.25 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. బీజేపీలో ఈటలకు సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో అసహనంతో ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. ఎవరెన్ని చెప్పినా ఏం చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ను బీజేపీని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు కౌశిక్ రెడ్డి.