Advertisement
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విపక్ష నేతలు విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. దీని వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ప్రభుత్వ పెద్దలదే అని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు మీ దగ్గరున్న ఆధారాలు తమకివ్వాలని సిట్ ప్రతిపక్ష నేతలను నోటీసులు పంపుతోంది. ఇంకోవైపు ఈ పంచాయితీని గవర్నర్ తమిళిసై దగ్గరకు చేర్చారు కాంగ్రెస్ నేతలు.
Advertisement
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు గవర్నర్ తో భేటీ అయ్యారు. పేపర్ లీకేజ్ వ్యవహారంలో చొరవ తీసుకోవాలని కోరారు. లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని తమిళిసై దృష్టికి తీసుకెళ్లారు. సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పేపర్ లీక్ లో మంత్రి కేటీఆర్ శాఖ ఉద్యోగులదే కీలకపాత్ర అని ఆరోపించారు. కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ కు అప్లికేషన్ పెట్టామన్నారు. వ్యాపం కుంభకోణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కోడ్ చేస్తూ అప్లికేషన్ ఇచ్చినట్టు వివరించారు.
Advertisement
పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని, కోట్లాది రూపాయలకు పేపర్ అమ్ముకున్నారనేది కాంగ్రెస్ వాదన. కేటీఆర్, జనార్ధన్ రెడ్డి, అనితా రామచంద్రన్ ను ప్రాసిక్యూట్ చేస్తే అసలు నిజాలు బయటకొస్తాయని అంటోంది. అందుకే, కాంగ్రెస్ కు ఓ అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు అప్లికేషన్ పెట్టుకుంది. అయితే.. దీనిపై లీగల్ ఓపినీయన్ తీసుకుని నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారు.
ఈ ఘటన చాలా పెద్దదని.. సీరియస్ గా తీసుకుంటామని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రతిరోజూ ప్రభుత్వం, ప్రతిపక్ష నేతల కామెంట్స్ చూస్తున్నానని తెలిపారు. గవర్నర్ ఈ వ్యవహారంపై సానుకూలంగా స్పందించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.