Advertisement
పక్కనే ఉన్న చైనా దేశంలో కరోనా విజృంభిస్తోంది. అక్కడ కొత్త వేరియంట్లు బీఎఫ్-7, బీఎఫ్-12 జనాన్ని ఆస్పత్రుల పాలు చేస్తున్నాయి. రోజురోజుకీ కేసుల తీవ్రత పెరిగిపోతోంది. అయితే.. ఇండియాలో ఈ వేరియంట్లు అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఇలాంటివే నాలుగు కేసులను గుజరాత్ బయోటెక్నాలజీ రీసర్చ్ సెంటర్ గుర్తించింది. మూడు ఒమిక్రాన్ బీఎఫ్-7, బీఎఫ్-12 కేసులు గుజరాత్ లో, మరొకటి ఒడిశాలో వెలుగులోకి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
Advertisement
చైనాను కమ్మేస్తున్న కొత్త వేరియంట్లు మన దగ్గర కూడా బయటపడ్డాయన్న వార్తల నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలను అలర్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఓవైపు ఆందోళన వద్దని చెబుతూనే అజాగ్రత్త పనికిరాదని తెలిపారు. కరోనాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Advertisement
ఇప్పటికే దేశంలోని విమానాశ్రయాల్లో ముఖ్యంగా చైనా లాంటి కరోనా ప్రభావిత విదేశాల నుంచి వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికులకు ర్యాండమ్ శాంపిల్స్ పరీక్షలకు సిద్ధమైంది కేంద్రం. కోవిడ్-19 మళ్ళీ ఇండియాలో వ్యాపించకుండా మొదట విదేశీ ప్రయాణికులపై దృష్టి సారించింది. టెస్టింగులను రోజుకు 100 నుంచి 600 కు పెంచుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వీటిని చేపడుతున్నామని, వీరంతా సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నామని సూచించాయి.
ఇప్పటికే భారత ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో మళ్ళీ గైడ్ లైన్స్ ని జారీ చేయడానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని ఎయిర్ పోర్టుల్లో సిబ్బందికి ఈ నమూనాల పరీక్షలకు సంబంధించి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు విధిగా మాస్కులు ధరించాలన్న నిబంధనను కూడా అమలులోకి తేవచ్చునని భావిస్తున్నారు.