Advertisement
మనం యూట్యూబ్లో పాటలు వింటాం. సినిమాలు చూస్తాం. ఆ అమ్మాయి కూడా యూట్యూబ్ చూసింది. కానీ సరదా కోసం కాదు. పాఠాల కోసం. యూట్యూబ్ లోనే క్లాసులు విని ఏకంగా ఎంబిబిఎస్ లో రాష్ట్రస్థాయిలో 700 వ ర్యాంకు సాధించింది. నిజామాబాద్ కు చెందిన హారిక ఈ ఘనతను సాధించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నామ్ దేవ్ వాడకు చెందిన సతీష్ కుమార్, అనురాధల కుమార్తె హారిక.
Advertisement
తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి బీడీ కార్మికు రాలిగా పనిచేస్తూ, కూతురిని చదివించింది. హారిక మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది. 10వ తరగతిలో 9.5 జిపిఏ, ఇంటర్ లో 942 మార్కులు సాధించింది. ఇంటర్ తర్వాత నీట్ లో ర్యాంక్ సాధించడమే లక్ష్యంగా ఇంట్లోనే యూట్యూబ్ లో వీడియో క్లాసులు వింటూ నీట్ కు సిద్ధమైంది. నీట్ లో జాతీయస్థాయిలో 40 వేల ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 700 ర్యాంకు సాధించింది.
Advertisement
హైదరాబాదులోని ఓ కాలేజీలో సీటు వచ్చినప్పటికీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇంట్లోనే ఉండిపోయింది. హారిక ఆర్థిక పరిస్థితి గురించి సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో విషయం తెలుసుకున్న నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమె చదువు బాధ్యతను పూర్తిగా తానే తీసుకుంటానని, ఎంబిబిఎస్ చదువుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్సీ కవిత కూడా హారికను ఆర్థికంగా ఆదుకుంటానని ఇటీవలే భరోసా ఇచ్చారు. మరోవైపు బిజెపి నాయకులు దన్ పాల్ సూర్యనారాయణ కూడా విషయం తెలుసుకుని హారిక ఇంటికి వెళ్లి కలిశారు. ధన్ పాల్ లక్ష్మి, విట్టల్ ట్రస్ట్ ద్వారా 25 వేల తక్షణ సహాయం అందించారు. ఒక అన్నలా అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు.