Advertisement
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామం. అప్పుడెప్పుడో జనసేన సభ కోసం స్థలం విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఇబ్బందులు పెడుతుంటే.. తమ పొలాలను వాడుకోమని ఆ గ్రామస్తులంతా కలిసి ముందుకొచ్చారు. అప్పట్లో ఈ నిర్ణయంపై సర్వత్రా చర్చ సాగింది. ఊరి పేరు మీడియాలో మార్మోగింది. వీళ్ల ధైర్యానికి మెచ్చి పవన్ కళ్యాణ్ గ్రామాభివృద్ధి కోసం సొంత డబ్బులు రూ.50 లక్షలు ప్రకటించారు. అయితే.. ఇన్నాళ్లకు మరోసారి ఇప్పటం గ్రామం వార్తల్లో నిలిచింది.
Advertisement
పవన్ కళ్యాణ్ ప్రకటించిన రూ.50 లక్షలు తమకు జమ చేయాలంటూ సీఆర్డీఏ అధికారులు గ్రామస్తులపై ఒత్తిడి చేశారు. దానికి ప్రజలు, జనసేన నేతలు ససేమిరా అన్నారు. ఈ పంచాయితీ నడుస్తుండగా.. గ్రామంలో 70 అడుగులు ఉన్న రోడ్డును 120 అడుగులకు విస్తరిస్తామంటూ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది ప్రభుత్వం. అందులో భాగంగా కూల్చివేతలు చేపట్టింది. గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసు బలగాలతో అధికారులు కూల్చివేతలు నిర్వహించారు.
Advertisement
ఈ కూల్చివేతలతో పవన్ రంగంలోకి దిగారు. ఇప్పటం గ్రామస్తులు జనసేన మద్దతుదారులు కావడమే వైసీపీ ప్రజాప్రతినిధుల ఆగ్రహానికి కారణమన్నారు. ఇప్పటికే 70 అడుగుల రోడ్డు ఉంటే ఇంకా విస్తరణేంటని ప్రశ్నించారు. రోడ్డు పక్కనే ఉన్న ట్యాంక్ వదిలి.. దాని అవతల వైపు ఉన్న ఇంటిని కూలగొట్టారని మండిపడ్డారు. ఆందోళనకు దిగిన జన సైనికులను, మహిళలను పోలీసులు ఆరెస్ట్ చేశారని ఫైరయ్యారు. వైసీపీ.. తమకు అనుకూలంగా ఓటు వేసినవారిని ఒకలా.. వేయనివారిని శత్రువులుగా చూస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పాలన నూటికి నూరు శాతం అలాగే ఉందని మండిపడ్డారు పవన్.
మరోవైపు పవన్ శనివారం ఇప్పటం గ్రామానికి వెళ్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇటు కూల్చివేతలపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఆపార్టీ నేత చిల్లపల్లి శ్రీనివాసరావు పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసర విచారణ జరిపిన న్యాయస్థానం కూల్చివేతలు ఆపాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. దీంతో అధికారులు చేసేదిలేక అక్కడి నుంచి వెనుదిరిగారు.