Advertisement
సీనియర్ల తిరుగుబాటుతో కాంగ్రెస్ లో పరిస్థితి గందరగోళంగా మారింది. పైకి రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పకపోయినా.. అలాంటి అర్థం వచ్చేలా వారు మాట్లాడుతుండడంతో వలస నేతలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయినా కూడా వెనక్కి తగ్గకపోవడంతో అధిష్టానం పరిస్థితి చక్కబెట్టే బాధ్యతను సీనియర్ నేత దిగ్విజయ్ కు అప్పగించింది. ఆయన హైదరాబాద్ వచ్చి ఒక్కో నేతను కలిసి ఫుల్ క్లాస్ తీసుకున్నట్లు చెబుతున్నారు.
Advertisement
దిగ్విజయ్ ను అందరికంటే ముందు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. ఆయనకు ముందుగా ఉన్న కార్యక్రమాల నేపథ్యంలో గురువారం కలిసేందుకు వీలు లేకపోవడంతో బుధవారం రాత్రే.. దిగ్విజయ్ బస చేస్తున్న హోటల్ కు వెళ్లి భేటీ అయ్యారు. డిగ్గీరాజాతో దాదాపు 20 నిమిషాలపాటు చర్చించారు కోమటిరెడ్డి. రేవంత్‌రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక పార్టీ పరిస్థితి ఎలా ఉందో వివరించారు. అలాగే పార్టీ పుంజుకోవడానికి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. మళ్లీ ఢిల్లీలో కలుద్దామని దిగ్విజయ్ తనతో చెప్పారన్నారు కోమటిరెడ్డి. పార్టీ మారతారంటూ జరుగుతోన్న ప్రచారంపైనా క్లారిటీ ఇచ్చారు. అసలా మాట తానెప్పుడన్నాను అంటూ మీడియానే ఎదురు ప్రశ్నించారు.
Advertisement
ఇక గురువారం భేదాభిప్రాయాలు ఎందుకు వచ్చాయనే కోణంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు వి.హనుమంతరావు, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క సహా పలువురు నేతలను దిగ్విజయ్ కలిశారు. పీసీసీ ఏకపక్ష నిర్ణయాల వల్లే నాయకుల మధ్య విబేధాలు వచ్చాయని వీహెచ్ తెలిపారు. దిగ్విజయ్ సమస్యల్ని పరిష్కరిస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో త్వరలోనే సమస్యలన్నీ సర్దుకుంటాయని సీతక్క అన్నారు.
అయితే.. దిగ్విజయ్ కొందరు నేతలను మందలించినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలో జూనియర్, సీనియర్ అనే పంచాయతీ మంచిది కాదని ఆయన క్లాస్ తీసుకున్నట్లు చెబుతున్నారు. సమస్యలుంటే అధిష్టానం దృష్టికి తీసుకు రావాలే గానీ.. మీడియా ముందు మాట్లాడడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారట. అంతర్గత సమస్యపై అభిప్రాయాలు చెప్పాలని.. ఎవరేం పని చేస్తున్నారో అధిష్టానం గమనిస్తుందని.. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోదని హెచ్చరించారట దిగ్విజయ్.