Advertisement
ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన నేతల్లో కన్నా లక్ష్మీ నారాయణ ఒకరు. నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలలో మంత్రిగా పని చేశారు. 2014 అక్టోబర్ 27న అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా పని చేశారు. సోము వీర్రాజును అధ్యక్షుడిగా నియమించిన దగ్గర నుంచి సైలెంట్ అయిపోయారు. అప్పుడప్పుడే పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తూ వస్తున్నారు. కానీ, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Advertisement
ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంది. కానీ, కమలం పెద్దలు పవన్ ను లైట్ తీసుకోవడంతో ఆయన అసంతృప్తిలో ఉన్నారనే వాదన ఉంది. దీనికితోడు చంద్రబాబు, పవన్ భేటీ తర్వాత అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో కన్నా లక్ష్మీ నారాయణ పవన్ ను దూరం చేసుకోవడం బీజేపీ స్వయంకృతాపరాధమే అని వ్యాఖ్యానించారు. జనసేనానితో సమన్వయం చేసుకోవడంలో సోము వీర్రాజు విఫలమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కన్నా.. పార్టీ మారడం కోసమే ఈ వ్యాఖ్యలు చేశారా? అనే అనుమానం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
Advertisement
ఇంకో 19 నెలల్లో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. జగన్ ను కొట్టాలంటే టీడీపీ, జనసేన పొత్తే కరెక్ట్ అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. కన్నా వైసీపీలో చేరే ఛాన్స్ లేదు. ఎందుకంటే.. మొదటి నుంచి జగన్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఆ రీతిలో చంద్రబాబును తిట్టిన దాఖలాలు తక్కువే. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ తోనూ అంతగా విభేదాలు లేవు. ఇప్పుడు కన్నా.. టీడీపీ వైపు వెళ్తారా. లేక.. జనసేనలో చేరతారా? అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైతే.. జనసేనకు 40 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంటుందని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. అలా కాకుండా పవన్ పట్టుబడితే అంతకంటే ఎక్కువ సీట్లు ఇవ్వడానికైనా చంద్రబాబు వెనుకాడకపోవచ్చనే అభిప్రాయం కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటినీ అంచనా వేసుకుని తన రాజకీయ భవిష్యత్తు కోసం కన్నా లక్ష్మీ నారాయణ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. తన అనుచరులతో కూడా ఆయన సమాలోచనలు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు.