Advertisement
తెలంగాణ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. టూర్ లో భాగంగా భద్రాచలం, రామప్ప ఆలయాలను ఆమె సందర్శించారు. ముందుగా భద్రాద్రి ఆలయానికి వెళ్లగా.. మర్యాదలతో అర్చకులు, వేద పండితులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఆలయంలో ముర్ము ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాద్ పథకంలో భాగంగా సుమారు రూ.41 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ముర్ము ఆవిష్కరించారు.
Advertisement
వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మక్క-సారలమ్మ జన్ జాతి పూజారి సమ్మేళనంలో పాల్గొన్నారు ముర్ము. ఈ సమ్మేళనం తర్వాత ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో నిర్మించిన ఏకలవ్య గురుకుల పాఠశాలను వర్చువల్ గా ప్రారంభించారు. ఆ తర్వాత రామప్ప ఆలయానికి వెళ్లారు ముర్ము. ఆలయంలో అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. రుద్రేశ్వరుడికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందించారు.
Advertisement
రాష్ట్రపతి వెంట.. గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ సహా పలువురు నేతలు ఉన్నారు. రాష్ట్రపతికి, గర్నవర్ తమిళిసైకి మేడారం సమ్మక్క సారలమ్మ చీరను ఆదివాసీ పూజారులు అందజేశారు. ఆలయ నిర్మాణం, విశిష్టత, యునెస్కో గుర్తింపునకు తయారు చేసిన డోసియర్ వివరాలు, వరల్డ్ హెరిటేజ్ సంస్థ విధించిన నిబంధనలు, తదితర అంశాలను రాష్ట్రపతికి కాకతీయ హెరిటేజ్ ట్రస్టు కన్వీనర్ పాండురంగారావు వివరించారు.
తెలంగాణలో తన పర్యటన తీపి జ్ఞాపకంగా మిగులుతుందన్నారు ముర్ము. భద్రాద్రి రాముడి దర్శనం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని తెలిపారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి వ్యాఖ్యలను రాష్ట్రపతి ప్రస్తావించారు. రామాయణంలో భద్రాచలానికి ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. దేశంలో ఆలయాలను సందర్శించే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. సమాజ అభివృద్ధి అందరి బాధ్యత అని చెప్పిన ఆమె.. పిల్లలు దేశ భవిష్యత్ అని తెలిపారు. వారు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.