Advertisement
సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్.. ఇద్దరు కుమారుల మధ్య నలిగిపోతున్నారు. ఒకరు, కాంగ్రెస్ లో ఇంకొకరు బీజేపీలో ఉండడమే అందుకు కారణం. చాలాకాలం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు డీఎస్. 2015లో బీఆర్ఎస్ లో చేరిన ఈయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. అయితే.. తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తన పెద్ద కుమారుడు సంజయ్ కోసం గాంధీ భవన్ కు వెళ్లిన డీఎస్ కు కాంగ్రెస్ నేతలు కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా చేరినట్టు ప్రకటించారు.
Advertisement
అయితే.. అనూహ్యంగా తాను కాంగ్రెస్ లో చేరలేదని.. ఒకవేల చేరినట్టు మీరు భావిస్తే రాజీనామా చేస్తున్నానని అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాశారు. ఆయన భార్య కూడా ఓ వీడియో బైట్ విడుదల చేశారు. తన భర్త అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం లేదని, ఎవరూ తమ ఇంటికి రావొద్దని సూచించారు. ఆయన కాంగ్రెస్ లో చేరినట్టు వచ్చిన వార్తలు చూసి ఫిట్స్ వచ్చాయని అన్నారు. దీంతో ఏం జరిగిందో ఏంటో అర్థం కాక కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో పడ్డారు.
Advertisement
ఇటు పెద్ద కుమారుడు సంజయ్ డీఎస్ పేరిట వచ్చిన లేఖలను నమ్మవద్దని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తన తండ్రి.. సొంత ఇంటికి వచ్చిన ఆనందాన్ని పొందుతున్నారని.. కానీ, కొందరు జీర్ణించుకోలేక ఆయన పేరిట ఫేక్ లేఖలు బయటపెడుతున్నారని అన్నారు. డీఎస్ భార్య విడుదల చేసిన లేఖలపై సంజయ్ మీడియాతో మాట్లాడారు. డీఎస్ ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని, సాంకేతిక కారణాలతోనే పార్టీలో చేరడం ఆలస్యమైందన్నారు. ఆయన లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని ప్రజలు, పార్టీ నాయకులు స్వాగతిస్తున్నారని అన్నారు. తన తమ్ముడు, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఒత్తిడి వల్లే తమ తండ్రి డీఎస్ కాంగ్రెస్ కు రాజీనామా చేసినట్లు ఆరోపించారు.
సోదరుడు సంజయ్ చేసిన ఆరోపణలపై అరవింద్ స్పందించారు. తమ తండ్రి డీఎస్ రాజీనామాతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనపై సంజయ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫైరయ్యారు. తన తండ్రి కాంగ్రెస్ వాదేనని తెలిపారు. ఆయన దారి ఆయనది.. తన దారి తనదని స్పష్టం చేశారు. కాకపోతే, ఈ వయసులో ఆయన్ను ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఆరోగ్యం సహకరించక ఇబ్బంది పడుతుంటే.. గాంధీ భవన్ కు తీసుకెళ్లి మరీ చేర్చుకోవడం కరెక్ట్ కాదని చెప్పారు. ఆరోగ్యం బాగున్న రోజుల్లో డీఎస్ చేరతానంటే చేర్చుకోలేదని తెలిపారు అరవింద్. తన తండ్రికి ఫిట్స్ వచ్చిన మాట వాస్తవమే అని దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయని చెప్పారు. డాక్టర్లకు చూపించేందుకే వీడియోలు తీశామని తెలిపారు.