Advertisement
టీఆర్ఎస్ లో ఓ వెలుగు వెలిగారు ఈటల రాజేందర్. అలాగే.. ఎన్నో అవమానాలు కూడా పడ్డారు. చివరకు ఆపార్టీని వీడి బీజేపీలో చేరారు. కేసీఆర్ ఓటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఆ దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. చివరకు సీఎం పోటీ చేసే నియోజకవర్గంలో సైతం బరిలోకి దిగుతానని సవాల్ చేశారు. అయితే.. ఈటల ఢీ అంటే ఢీ అని ఓవైపు యుద్ధం చేస్తుంటే.. ఇంకోవైపు ఆయన తిరిగి టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఘర్ వాపసీ పేరుతో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Advertisement
ఈటల రాజేందర్ బీజేపీ చేరికల కమిటీకి ఇంచార్జ్ గా ఉన్నారు. అయితే.. చేరికలు, సంప్రదింపులు అన్నీ ఆయనకు సంబంధం లేకుండా జరుగుతున్నాయని అసంతృప్తిలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. అలాగే.. పార్టీలో తనకు ఎలాంటి ప్రాధాన్యం దక్కకుండా చేస్తున్నారనే అసంతృప్తిలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. టీఆర్ఎస్ లో అనుభవించిన అవే అవమానాలు.. బీజేపీలోనూ ఎదుక్కొంటున్నారని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. అందుకే ఆయన తిరిగి టీఆర్ఎస్ లో చేరేందుకు ఆఫర్ వచ్చిందని అంటున్నారు.
Advertisement
ఈమధ్యే టీఆర్ఎస్ లో చేరారు స్వామిగౌడ్, శ్రవణ్. వీళ్లిద్దరూ బీజేపీలో ఉన్నారు. అప్పటిదాకా తమకు ప్రాధాన్యం దక్కడం లేదని గులాబీ గూటికి చేరారు. వారితోపాటు ఈటలకు నెంబర్ 2 పొజిషన్ ఇస్తామన్న సంకేతాలను కేసీఆర్ పంపినట్లుగా చెబుతున్నారు. అందుకే దేవరయాంజల్ భూములపై కమిటీ నివేదిక ఇచ్చిందని.. అవన్నీ ప్రభుత్వ భూములేనని వెనక్కి తీసుకోవాలని సిఫార్సు చేసిందని అంటున్నారు. అంటే.. వెనక్కి రాకపోతే భూములన్నీ తీసుకుంటామని సంకేతం పంపినట్లేనని అంచనా వేస్తున్నారు.
అయితే.. జరుగుతున్న ప్రచారంపై ఈటల స్పందించారు. తిరిగి టీఆర్ఎస్ లోకి వెళ్తే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇదంతా కేసీఆర్ డ్రామాగా తెలిపారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. బీజేపీ నుంచి తిరిగి టీఆర్ఎస్ లో చేరుతున్నానని, తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారన్న ప్రచారం అంతా వదంతులేనని కొట్టిపారేశారు. టీఆర్ఎస్ పార్టీలో ఎన్నో ఇబ్బందులు పెట్టారని అవన్నీ మర్చిపోలేదని.. కేసీఆర్ ఓటమే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు ఈటల రాజేందర్.