Advertisement
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మొదట్నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు వినిపిస్తోంది. సీబీఐ ఓమారు ఆమెను ప్రశ్నించింది. అయితే.. కవితకు అత్యంత దగ్గర మనిషిగా భావించే అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్ట్ చేసింది. 7 రోజుల కస్టడీకి కూడా తీసుకుంది. ఇది జరిగిన ఒక్కరోజు తర్వాత కవితకు ఈడీ నుంచి పిలుపొచ్చింది. విచారణ కోసం 9న ఢిల్లీ రావాలని నోటీసులో పేర్కొంది.
Advertisement
కవిత, పిళ్లైల మధ్య లావాదేవీలు జరిగాయని ఈడీ గుర్తించింది. కవిత ప్రయోజనాల కోసం పిళ్లై పనిచేశాడని విచారణలో తేల్చింది. దాంతో రిమాండ్ రిపోర్టులో ఆమె పేరును ఈడీ ప్రస్తావించింది. విచారణలో పిళ్లై తాను కవిత బినామీనే అని ఒప్పుకున్నాడు. అంతకుముందు సౌత్ గ్రూప్ నుంచి ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు చేరాయని ఈడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కవితను ఈడీ విచారణకు పిలవడం హాట్ టాపిక్ గా మారింది.
Advertisement
ఈడీ నోటీసులపై స్పందించిన కవిత.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదన్నారు. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తామని.. ఢిల్లీలో ఉన్న అధికార కాంక్షాపరులకు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నానని స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా తాను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని తెలిపారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలతో కలిసి భారత జాగృతి ఈనెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టిందని చెప్పారు. ఆ ధర్నాకు ఒకరోజు ముందు విచారణకు రావాల్సిందిగా ఈడీ తనకు నోటీసులు జారీ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ధర్నా, ముందస్తు అపాయింట్ మెంట్స్ రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానని చెప్పారు. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ ని, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని తెలుసుకోవాలని మండిపడ్డారు కవిత.