Advertisement
రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఎన్నో చేస్తుంటారు. అన్ని వర్గాల ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు అనేక విన్యాసాలు చేస్తారు. ఆలయానికి వెళ్తే కాషాయ కండువా కప్పుకుంటారు. ముస్లింలను కలిస్తే టోపీ పెట్టి నమాజ్ చేస్తారు. చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేస్తారు. ఇలా ఎన్నో చేస్తుంటారు. కానీ, ఒక్కోసారి చిక్కుల్లో పడుతుంటారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ పరిస్థితి అదే.
Advertisement
ప్రస్తుతం అనిల్ అయ్యప్ప దీక్షలో ఉన్నారు. అయ్యప్ప స్వామి మాల అంటే అందరికీ తెలుసు. ఎంతో నిష్టగా చేయాలి. ఈ దీక్షను హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే.. అయ్యప్ప దీక్షలో ఉండి ముస్లిం టోపీ, కండువా ధరించారు అనిల్. ఇదే వివాదానికి దారి తీసింది. నెల్లూరు నగరంలోని ఖుద్దూస్ నగర్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అనిల్ కుమార్ ఇంటింటికి తిరిగారు. అయితే.. ఈ ప్రాంతంలో ముస్లింల ప్రాబల్యం ఎక్కువ. అక్కడి వారి కోరిక మేరకు ముస్లిం టోపీ, కండువా ధరించారు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Advertisement
అయ్యప్ప దీక్షలో ఉన్న అనిల్.. ముస్లిం టోపీ, కండువా ధరించడంపై హిందూ సంఘాలు, బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. వెంటనే హిందూ సమాజానికి ముఖ్యంగా అయ్యప్ప భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే అనిల్ ఇంటిని ముట్టడించారు బీజేవైఎం నాయకులు. అయితే.. ఎమ్మెల్యే ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై వైసీపీ శ్రేణులు రాళ్లదాడికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని బీజేవైఎం నేతలు తెలిపారు.
ఈ సంఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న అనిల్ ముస్లిం టోపీ, కండువా వేసుకుని భక్తుల్ని అవమానించారని మండిపడ్డారు. దీక్ష నియమాలు పాటించని ఎమ్మెల్యేని శబరిమల వెళ్లకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం ఇంత బరితెగించాల్సిన అవసరం లేదని ఫైరయ్యారు బీజేపీ నేతలు.