Advertisement
ప్రభుత్వం ఏ విషయంలో దొరుకుతుందా? ఆడేసుకుందామని ప్రతిపక్షాలు ఎదురుచూస్తూ ఉంటాయి. అలా వారికి దొరికిన అస్త్రం కామారెడ్డి మాస్టర్ ప్లాన్. శ్రీరాములు అనే రైతు ఆత్మహత్యతో ఈ గొడవ పీక్స్ కు చేరింది. రైతులు భారీ మార్చ్ నిర్వహించడం.. కలెక్టరేట్ ను ముట్టడించడం.. బంద్ కు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలుచోట్ల టెన్షన్ వాతావరణం కనిపించింది.
Advertisement
కామారెడ్డి టౌన్, విలీన గ్రామాలు అడ్లూర్, అడ్లూర్ ఎల్లారెడ్డి, టెకిర్యాల్, ఇల్చిపూర్, దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, పాతరాజంపేట, రామేశ్వర్ పల్లి కలుపుకొని 61.5 చదరపు కిలోమీటర్ల పరిధికి సంబంధించి ఢిల్లీకి చెందిన ఒక కన్సల్టెన్సీ కామారెడ్డి మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ ను రూపొందించింది. డ్రాఫ్ట్ రిలీజ్ చేసిన అధికారులు 2023 జనవరి 11 వరకు అభ్యంతరాలు చెప్పుకునేందుకు అవకాశం ఇచ్చారు. ప్లాన్ లో 8.5 శాతం ఏరియా 1,200 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ కింద ప్రతిపాదించారు. ఇందులో దాదాపు 900 ఎకరాలు నేషనల్ హైవే పక్కన.. టౌన్ కు దగ్గరగా ఉన్న భూములే ఉన్నాయి. వాటిలో వివిధ పంటలు పండుతుంటాయి. అలాంటి భూముల్లో ఇలాంటి ప్లాన్స్ ఎందుకని రైతులు నిరసన బాట పట్టారు.
Advertisement
ఈక్రమంలోనే రైతు కామారెడ్డి బంద్ నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీలు ఈ బంద్ కు మద్దతు తెలిపాయి. ఆత్యహత్య చేసుకున్న ఎల్లారెడ్డిగూడకు చెందిన రైతు కుటుంబాన్ని పరామర్శించారు కాంగ్రెస్ నేతలు. అదే విధంగా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ కామారెడ్డికి వెళ్లారు. అయితే.. పోలీసులు ఆయన్ను అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఆ తరువాత షబ్బీర్ అలీ, కోదండ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు.. కలెక్టర్ తో సమావేశమయ్యారు. అన్నదాతల సమస్యలను తీర్చాలని వినతి పత్రం అందజేశారు. కొత్త మాస్టర్ ప్లాన్ ను సవరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
రైతు రాములు కుటుంబాన్ని బీజేపీ చీఫ్ బండి సంజయ్ పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రియల్ జోన్ పేరుతో రెండు పంటలు పండే రైతుల పొలాలు గుంజుకోవడం దారుణమని అన్నారు. రైతులు ఎదురు తిరిగి అడగరనే ధైర్యంతోనే ప్రభుత్వం వాళ్ల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రైతులు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కామారెడ్డి మాస్టర్ ప్లాన్ మార్చారని ఆరోపించారు. రైతులు ఉద్యమించకపోతే ఆ డ్రా ఫ్ట్‌ను ఆమోదించేవారని తెలిపారు. సీఎం కేసీఆర్ ది త్వరలోనే ఊడిపోయే ప్రభుత్వమని ఎద్దేవ చేశారు బండి సంజయ్.
ఇటు కామారెడ్డి పట్టణంలో బీజేపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛందంగా షాపులు బంద్ చేయాలని వ్యాపార, వాణిజ్య వర్గాలను కోరారు. రైతుల భూములపై స్పష్టత ఇచ్చే వరకూ ఉద్యమాన్ని ఆపేదిలేదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ర్యాలీ చేపట్టిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డిలో రైతుల ఆందోళన ముఖ్యమంత్రి పతనానికి నాంది అని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ఎవరో రైతు చనిపోయాడని మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని.. అంత ఎగతాళిగా, వ్యంగ్యంగా మాట్లాడుతారా? అని మండిపడ్డారు.