Advertisement
మొన్న కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఇష్యూ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు జగిత్యాల మాస్టర్ ప్లాన్ అంశం కూడా అదే దారిలో నడుస్తోంది. భూములు కోల్పోతాయని భావించిన అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. వీరికి అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు సైతం మద్దతు తెలుపుతున్నారు. మాస్టర్ ప్లాన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
జగిత్యాల అర్బన్ మండలం థరూర్ గ్రామ పాలకవర్గం సమావేశమై.. మాస్టర్ ప్లాన్ లో తమ గ్రామాన్ని కమర్షియల్ జోన్ కింద చేర్చడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు తీర్మానం చేసిన పాలకవర్గ సభ్యులు.. ర్యాలీగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు తీర్మాన పత్రాన్ని అందించారు. అంబారిపేట్ గ్రామస్తులు కూడా గ్రామసభ నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై సభలో చర్చించారు.
ఈ గ్రామ సభకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరై గ్రామస్తులకు సంఘీభావం తెలిపారు. అనంతరం మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ముసాయిదా వెంటనే రద్దు చేయాలని మహిళా రైతులు గ్రామ పంచాయతీ బిల్డింగ్ పైకి ఎక్కి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే, కలెక్టర్ వచ్చి తమకు రద్దు తీర్మానం ఇచ్చే వరకూ పోరాటం చేస్తామంటూ డిమాండ్ చేశారు.
Advertisement
నర్సింగాపూర్ మహిళా రైతులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంటి ముందు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ భూములను తీసుకోవద్దని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. అలాగే కలెక్టరేట్ ముందు అంబారిపేట్, హస్నాబాద్ రైతులు నిరసనకు దిగారు. కలెక్టర్ వచ్చి తమ వినతిపత్రం స్వీకరించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు కామారెడ్డిలోనూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ విషయంలో అధికారులు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకుండానే నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. ఈక్రమంలోనే బాలకృష్ణ అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే గుర్తించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. మాస్టర్ ప్లాన్ లో తన భూమి పోతోందని రైతు ఆందోళనతో పురుగుల మందు తాగినట్టుగా జేఏసీ నేతలు చెబుతున్నారు. ఈనెల 4వ తేదీన అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటినుంచి వివాదం రాజుకుంది.