Advertisement
ఓవర్ లో మూడు సిక్సులు కొడితేనే అద్భుతంగా భావిస్తాం. అలాంటిది ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొడితే ఎలా ఉంటుంది? అప్పుడెప్పుడో యువరాజ్ సింగ్ అలా బాదడం చూశాం. ఆ తర్వాత కొందరు విదేశీ ఆటగాళ్లు ఈ రికార్డ్ ను రిపీట్ చేశారు. ఈ ఏడాది జూన్ లో పాండిచ్చేరి టీ-10 లీగ్ లో కృష్ణ పాండే అనే ప్లేయర్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. అయితే.. దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన రికార్డ్ క్రియేట్ అయింది.
Advertisement
ఒకే ఓవర్ లో 7 సిక్సులు కొట్టిన మొదటి ఆటగాడిగా రుతురాజ్ గైక్వాడ్ ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. విజయ హజారే టోర్నమెంట్ లో భాగంగా క్వార్టర్ ఫైనల్ లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తలపడ్డాయి. ఇందులోనే హిస్టరీ క్రియేట్ చేశాడు గైక్వాడ్. 220 పరుగులతో డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. అతను కొట్టిన డబుల్ సెంచరీలో మొత్తం 16 సిక్సర్లు, 10 ఫోర్లు ఉన్నాయి. కేవలం బౌండరీలతోనే 26 బంతుల్లో 136 పరుగులు చేశాడు.
Advertisement
ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మహారాష్ట్ర ఇన్నింగ్స్ 48వ ఓవర్ కు రుతురాజ్ వ్యక్తిగత స్కోర్ 165. 49వ ఓవర్ లో బౌలింగ్ కు స్పిన్నర్ శివ సింగ్ వచ్చాడు. రుతురాజ్ వీరవిహారం చేశాడు. మొదటి 5 బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. ఆ తర్వాత శివ నో బాల్ వేశాడు. దాంతో ఫ్రీ హిట్ వచ్చింది. దాన్ని కూడా రుతురాజ్ స్టాండ్స్ లోకి పంపిచాడు. లాస్ట్ బాల్ కూడా సిక్స్ బాదేశాడు. దీంతో ఒకే ఓవర్ లో 7 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు.
రుతురాజ్ విధ్వంసంతో ఆ ఓవర్ లో రికార్డు స్థాయిలో 43 పరుగులు వచ్చాయి. అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా శివ సింగ్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఫుల్లర్ పేరిట ఉంది. రుతురాజ్ 7 సిక్సర్లతో చెలరేగిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో పెట్టింది. ఐపీఎల్ లో చైన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్నాడు గైక్వాడ్. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో విఫలం కావడంతో టీమిండియాలో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం పునరాగమనం చేయాలనే పట్టుదలతో ఉన్నాడు.