Advertisement
బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటి లోపలికి వెళ్లి మరీ దాడికి పాల్పడడం తెలంగాణలో సంచలనంగా మారింది. దీనిపై బీజేపీ నేతలు ప్రభుత్వ, పోలీస్ నిర్లక్ష్యాన్ని తప్పుబడుతున్నారు. ఇంటి లోపలికి వెళ్లే దాకా ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ ఘటనపై అరవింద్ తల్లి విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తరఫున పర్సనల్ అడ్వకేట్లు, మేనేజర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.
Advertisement
50 మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు విజయలక్ష్మి. ప్రధాన గేటు పగులగొట్టి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి టీఆర్‌ఎస్ జెండాలు, కర్రలతో, రాళ్లతో దాడికి పాల్పడ్డారని వివరించారు. ఈ కేసులో దాడి చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. 8మందిపై కేసులు పెట్టారు పోలీసులు. దాడికి పాల్పడిన 50 మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఫిర్యాదు చేయగా.. తక్కువమంది పైనే కేసులు బుక్ చేసినట్లు తెలుస్తోంది.
Advertisement
మరోవైపు ఈ ఘటనపై గవర్నర్ తమిళిసై స్పందించారు. సవివరమైన నివేదిక అందజేయాలని పోలీస్ డైరెక్టర్ జనరల్ ను కోరారు. హైదరాబాద్ లోని ఎంపీ నివాసంపై దాడి చేసి ధ్వంసం చేయడంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని.. ఓ ఎంపీ ఇంట్లో కుటుంబ సభ్యులను, పనిమనిషిని బెదిరించడం, భయపెట్టడం కరెక్ట్ కాదన్నారు. అందుకే డీజీపీ నుంచి నివేదిక కోరామని ఆమె తెలిపారు.
ఇటు అరవింద్ కూడా మరోసారి ఈ ఘటనపై మండిపడ్డారు. కవిత రాజకీయ జీవితం ముగిసిందని వ్యాఖ్యానించారు. దమ్ముంటే ఎన్నికల్లో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఆమె ఎక్కడ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని.. బీజేపీ నుంచి వందల కోట్ల ఆఫర్ ఎవరిచ్చారో కేసీఆర్ చెప్పాలని పేర్కొన్నారు. పోలీసులు గులాబీ కండువాలకు అమ్ముడు పోయారని మండిపడ్డారు.