Advertisement
తెలంగాణలో ప్రగతి భవన్ కు రాజ్ భవన్ కు మధ్య దూరం పెరిగింది. ఇది చాలా సందర్భాల్లో బయటపడింది. ప్రోటోకాల్ విషయంలో గవర్నర్ అసహనం వ్యక్తం చేయడం కామన్ అయింది. అలాగే.. తమిళిసై వల్లే ఇబ్బందులు వస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు ధీటుగా బదులివ్వడం జరుగుతోంది. ఈ పరిణామాల నడుమ మొన్న రాష్ట్రపతి పర్యటన వేళ చాలా రోజుల తర్వాత తమిళిసై, కేసీఆర్ ఒకే వేదిక పంచుకున్నారు. ఆ సమయంలో ఈ ఇష్యూ బాగా వైరల్ అయింది.
Advertisement
ఇప్పుడు మరోసారి పగ్రతి భవన్, రాజ్ భవన్ పంచాయితీ తెరపైకి వచ్చింది. దానికి కారణం ఖమ్మం సభలో కేసీఆర్ సహా జాతీయ నేతలు గవర్నర్ వ్యవస్థను ప్రశ్నించడమే. భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో కేసీఆర్ తోపాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్ తోపాటు అఖిలేష్ యాదవ్, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, తమ రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటోందంటూ విమర్శలు చేశారు.
Advertisement
ఈ వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రలుగా ఉండి గవర్నర్ ను ఎలా అవమానిస్తారని ప్రశ్నించారు. ప్రొటోకాల్ కు సంబంధించి తాను పలుమార్లు మాట్లాడినప్పటికీ కేసీఆర్ స్పందించలేదన్నారు. ఆయన స్పందించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని తేల్చి చెప్పారు.
జనవరి 26 గణతంత్ర దినోత్సవానికి సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదని గుర్తు చేశారు తమిళిసై. గవర్నర్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు. తాను ఎక్కడా హద్దులు దాటలేదని పేర్కొన్నారు. గత 25 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. ప్రొటోకాల్ ఏంటో తనకు తెలుసని తెలిపారు. గవర్నర్ వ్యవస్థను కించపరచడం మంచిది కాదని హితవు పలికారు తమిళిసై. ప్రస్తుతం గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై చర్చ సాగుతోంది.