Advertisement
రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కలకలం రేపింది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం. ఈ పంచాయితీ ప్రస్తుతం కోర్టుల చుట్టూ తిరుగుతోంది. బెయిల్ కోసం నిందితులు తెగ ప్రయత్నిస్తున్నారు. ఇంకోవైపు సిట్ అధికారులు ఇతర రాష్ట్రాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తూ కేసును మరింత స్ట్రాంగ్ చేసే పనిలో పడ్డారు. ఇదే క్రమంలో ఆరోజు ఆపరేషన్ లో పాల్గొన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరైన గువ్వల బాలరాజుకు కొత్త తలనొప్పి తయారైంది.
Advertisement
నలుగురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం నియోజకవర్గాలకు దూరమయ్యారు. ఇష్యూ బయటకొచ్చినప్పటి నుంచి ప్రగతి భవన్ లో ఉంటున్నారని.. తర్వాత ఫాంహౌస్ కు షిఫ్ట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సొంత నియోజకవర్గంలో బాలరాజుకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలంలో ఎమ్మెల్యేను నిలదీస్తూ, బెదిరిస్తూ వీటిని గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు. దీంతో ఈ విషయం కాస్తా ప్రస్తుతం అచ్చంపేట నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
Advertisement
“అచ్చంపేట ఆత్మగౌరవాన్ని రూ. 100 కోట్లకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అమ్ముకున్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల్లారా, యువకుల్లారా, మేధావుల్లారా, విద్యావంతుల్లారా ఒక్కసారి ఆలోచించండి. ఎటుపోతోంది మన అచ్చంపేట ఆత్మగౌరవం. ఎమ్మెల్యే బాలరాజును అచ్చంపేట పొలిమేర దాటే వరకు తరిమికొడదాం.. మన ఆత్మగారవాన్ని కాపాడుకుందాం” అంటూ పోస్టర్లలో రాశారు.
అంతేకాదు.. గతంలో ఎమ్మెల్యే చేసిన పలు సంఘటనలకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్టర్ లో చూపించారు. గువ్వల దురుసు ప్రవర్తనతో పలువురుపై దాడి చేసిన అంశాలు సైతం ముద్రించి అంటించారు. వికలాంగుడు శ్రీనుపై దాడి, గిరిజన సర్పంచ్ పై దాడి, ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించిన కార్యకర్తలపై రాళ్ల దాడి ఘటనలకు సంబంధించిన ఫోటోలను ఉంచారు. ఈ విషయంపై ప్రస్తుతం నియోజకవర్గంలో వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి.