Advertisement
తెలంగాణలో బీజేపీకి అంత సీన్ లేదు. ఇది ఒకప్పటి మాట. చేరికలను విపరీతంగా ప్రోత్సహించడంతో ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. ఇన్నాళ్లూ హైదరాబాద్ కే పరిమితమైన బీజేపీ.. మెల్లమెల్లగా ఇతర నియోజకవర్గాలకు విస్తరిస్తోంది. బలం పుంజుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని కమలనాథులు చెబుతున్నారు. అయితే.. సడెన్ గా ఇంత భారీ స్థాయిలో మార్పు అనేది కష్టమనేది విశ్లేషకుల వాదన.
Advertisement
ప్రస్తుతం బీజేపీ ఉంది ముగ్గురు ఎమ్మెల్యేలు. 2019 ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలవడంతో.. ఆయా నియోజకవర్గాల్లో ఈసారి సత్తా చాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ, సరైన లీడర్ల కొరత వేధిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. అయితే.. ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. బీజేపీని జనానికి దగ్గర చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కమలనాథులు.
Advertisement
బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన ఈటల రాజేందర్.. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి ఛాంబర్ కేటాయించలేరా అని ప్రశ్నించారు. చాంబర్ కేటాయించకుండా అవమాన పరుస్తున్నారన్నారు. టిఫిన్ బాక్స్ తెచ్చుకొని తిందామన్నా ఛాంబర్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సీపీఎం, లోక్ సత్తా పార్టీలకు ఒక్క సభ్యుడు ఉన్నా ఛాంబర్ కేటాయించారని, ఇప్పుడు ముగ్గురు ఉన్నా కేటాయించకపోవడం అవమానించడమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పదేపదే తప్పిదాలు చేస్తోందని మండిపడ్డారు రాజేందర్.
ఈటల వ్యాఖ్యల తర్వాత మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. అయితే.. బీజేపీ ఎమ్మెల్యేలకు ఎంతటి కష్టం వచ్చిందని అంతా అనుకుంటున్నారు. నిజానికి ఆపార్టీకి కావాల్సింది ఇదే. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఏ అంశాన్ని వదలకుండా కార్నర్ చేయడం వల్ల కాషాయ పార్టీకి కలిసొస్తుంది. ఇదే ఫార్ములాను అమలు చేస్తున్నారు ఆపార్టీ నేతలు. ఈటల రాజేందర్ అంతటి సీనియర్ లీడర్.. కనీసం తినడానికి ఛాంబర్ లేదని అడగడం ఏంటి..? ప్రభుత్వం ఇత కర్కశంగా వ్యవహరిస్తోందా? అనే చర్చకు తెరలేపారని సర్వత్రా వినిపిస్తోంది.