Advertisement
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మద్దతుగా బీజేవైఎం చేపట్టిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మార్కులు కలిపి న్యాయం చేయాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అయితే.. డీజీపీ ఆఫీస్ ముట్టడికి వెళ్లిన నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు నేతలు ఆఫీస్ లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ సొమ్మసిల్లి పడిపోయారు.
Advertisement
ఒక్కసారిగా వచ్చిన నాయకులు ప్రధాన కార్యాలయ గేటును తోసుకొని లోపలికి వెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు. భానుప్రకాష్ గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ… న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తే అమానుషంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కారుకు పోయే కాలం వచ్చిందని మండిపడ్డారు.
Advertisement
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మద్దతుగా ఆందోళన చేపట్టిన వారి పట్ల పోలీసులు రాక్షసంగా వ్యవహించారని అన్నారు బండి. భానుప్రకాష్ పరిస్థితిపై ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించడం చేతగాని కేసీఆర్.. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్లను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు సంజయ్. కేసీఆర్ కు నిరుద్యోగుల ఉసురు తగులుతుందని విమర్శించారు.
మరోవైపు నిరసన కారులకు పోలీసులు షాకిచ్చారు. డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేవైఎం నాయకులపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ సహా 20మందిపై క్రిమినల్ ట్రెస్ పాస్ యాక్ట్ కింద కేసు పెట్టారు.