Advertisement
ఓవైపు ఇన్వెస్టర్ల సమ్మిట్ ను అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం.. ఇంకోవైపు మిగిలిన కార్యక్రమాలను కూడా కొనసాగిస్తోంది. వివాదాస్పదమైన ఇప్పటం గ్రామంలో మరోసారి కూల్చివేతలకు దిగింది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా బుల్డోజర్లను అధికారులు గ్రామానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. గత అనుభవాల దృష్ట్యా స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది.
Advertisement
ఇప్పటంలో కట్టడాల కూల్చివేత ప్రక్రియ కొన్నాళ్ల క్రితం వివాదాస్పదమైంది. జనసేనతోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలాన్ని ఇచ్చినందుకే ఇప్పటం గ్రామస్థులను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని ఆపార్టీ నేతలు ఆరోపించారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ఇప్పటం వెళ్లి అక్కడి కూల్చివేతలను పరిశీలించారు. బాధితులను పరామర్శించారు.
Advertisement
ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కూల్చివేతలపై హైకోర్టుకు వెళ్లడం.. నోటీసులపై క్లారిటీ రావడం ఇలా చాలా జరిగాయి. కోర్టును తప్పుదోవ పట్టించారని గ్రామస్తులకు ఫైన్ కూడా వేసింది న్యాయస్థానం. అయితే.. వారికి జనసేన తరఫున సాయం అందజేశారు పవన్.
ఆనాటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈసారి భారీ బందోబస్తు మధ్య ఇప్పటం వెళ్లారు అధికారులు. ఎలాంటి ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా అడుగడుగునా పహారా కాస్తున్నారు. ఉద్రిక్తతల నడుమే గ్రామంలో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. జేసీబీలతో 8 కట్టడాల కూల్చివేతలను చేపట్టారు. అయితే.. ప్రభుత్వ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.