Advertisement
పుట్టపర్తి… ఎంతో ప్రశాంతమైన ఏరియా. ఉన్నది సీమలోనే అయినా.. చిన్న చిన్న ఘటనలు మినహా పెద్దగా ఈమధ్య కాలంలో వార్తల్లో నిలిచింది తక్కువే. కానీ, సడెన్ గా అక్కడ వాతావరణం హీటెక్కింది. పొలిటికల్ కేకలు మార్మోగుతున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా సవాళ్లు ప్రతిసవాళ్లు నడుస్తున్నాయి. వైసీపీ, టీడీపీ శ్రేణులు ఘర్షణకు దిగడంతో ప్రశాంత పుట్టపర్తి అట్టుడుకుతోంది.
Advertisement
ఇరు పార్టీల మధ్య అభివృద్ధి అగ్గి రాజుకుంది. ముందుగా పుట్టపర్తిని అభివృద్ధి చేసింది తామేనని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఎవరి హయాంలో నియోజకవర్గం అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసని చెప్పారు. అయితే.. పల్లె వ్యాఖ్యలపై ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఫైరయ్యారు. నూటికి నూరుపాళ్లు తమ పాలనలోనే అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. మాటామాటా పెరిగింది.. తేల్చుకుందాం అనే దాకా వెళ్లింది.
Advertisement
ఇద్దరు నాయకులు సవాల్ విసురుకున్నారు. పుట్టపర్తిలోని సత్తెమ్మ ఆలయానికి రావాలని ఇరువురు ఛాలెంజ్ చేసుకున్నారు. అన్నట్టుగా పల్లె రఘునాథరెడ్డి తన అనుచరులతో ఆలయానికి వెళ్లారు. అయితే.. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మాత్రం పోలీసులు అడ్డుకున్నారు. ఆలయంలో వైసీపీ ఎమెల్యే అవినీతికి పాల్పడ్డారని ప్రమాణం చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని అన్నారు. పాదయాత్రలో శ్రీధర్ రెడ్డి అవినీతిపై లోకేశ్ మాట్లాడినవన్నీ వాస్తవాలేనని చెప్పారు.
నాయకులే సవాళ్లు, ఛాలెంజ్ లు విసురుకుంటే అనుచరులు ఊరుకుంటారా? ఇరు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. చెప్పులు విసురుకున్నారు. ఈ ఘర్షణల్లో రెండు పార్టీలకు చెందిన నాయకుల వాహనాలు ధ్వంసమయ్యాయి. చివరకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. సత్యసాయి జిల్లాలో ఈనెల 30 వరకు సెక్షన్ 30 అమల్లో ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.