Advertisement
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి మంటలు ఇంకా ఆరలేదు. ఓవైపు కేసు నడుస్తుండగా.. ఇంకోవైపు అధికార, విపక్ష పార్టీల మధ్య నువ్వా నేనా అంటూ వార్ కొనసాగుతోంది. తప్పు మీదంటే మీదంటూ ఒకరినొకరు తిట్టిపోసుకుంటున్నారు. ఇదే సమయంలో ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను పొందుపరిచారు.
Advertisement
పలు ప్రెస్ మీట్ ల సందర్భంగా కవితను అరవింద్ పదేపదే టార్గెట్ చేశారని రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు పోలీసులు. కవితపై వ్యాఖ్యలకు నిరసనగానే ఎంపీ ఇంటిపై దాడి ప్లాన్ చేశారన్నారు. ఆయన ఇంటి దగ్గర ఎక్కువ సంఖ్యలో బందోబస్తు లేకపోవడంతో నిందితులు దాడికి తెగబడ్డారని అన్నారు. కవితపై ఎంపీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే ఇది చేసినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనలో 2 సిమెంట్ రాళ్ళు, 2 కర్రలు, టీఆర్ఎస్ జెండాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఇంట్లో ఉన్న పూజా సామాగ్రి, హాల్ ధ్వంసంతో పాటు కార్ పై దాడి చేశారన్నారు. నిందితులకు పోలీసులు 41 సీఆర్‌పీసీ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దాడి చేసిన తొమ్మిది మందిలో ఇద్దరు పీహెచ్డీ స్టూడెంట్స్ ఉన్నట్లు తెలిపారు.
Advertisement
తెలంగాణ జాగృతి నేత నవీనాచారి, కన్వీనర్ రాజీవ్ సాగర్ నిందితులుగా ఉన్నారని అన్నారు పోలీసులు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కొద్ది రోజుల క్రితం కవిత టార్గెట్ గా అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై అలిగి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఆమె ఫోన్ చేశారని.. తనకు ఈ విషయాన్ని ఓ నేత చెప్పినట్లు వెల్లడించారు. బీజేపీ నేతలు తన కూతురిని పార్టీ మారాలని కోరారంటూ కేసీఆర్ తప్పుడు ప్రకటన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వాళ్లు కూడా కవిత చేరికను తిరస్కరించారని చెప్పుకొచ్చారు.
కవితపై అరవింద్ వ్యాఖ్యలను నిరసిస్తూ.. టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించారు. ఇంట్లోకి చొరబడి కారు అద్దాలు, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. దిష్టి బొమ్మను దహనం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఎంపీ నోరు అదుపులో పెట్టుకోవాలని టీఆర్ఎస్ కార్యకర్తలు హెచ్చరించారు. దాడిపై ఎంపీ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది.