Advertisement
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఉద్యోగం ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని సీఎం ఏ.రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. నళినికి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీ.ఎస్, డీజీపీలను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే సీఎం రేవంత్ చేసిన ఈ ఆఫర్ కు నళిని ఈ కింది విధంగా స్పందించారు. అంతేకాదు.. ఓ బహిరంగ లేఖను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Advertisement
శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు నా మీద చూపిస్తున్న అభిమానానికి నా కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది. ఈ నేపథ్యంలో గతం ఒక రీల్ లా నా కళ్ల ముందు కదులుతుంది. ఇన్నాళ్లు నేను ఒక సస్పెండెడ్ ఆఫీసర్ గా చెడును మోసాను. ఆ నాటి ప్రభుత్వం మూడేండ్లు చాలా ఇబ్బంది పెట్టింది. తెలంగాణ ఉద్యమం కోసం డిసెంబర్ 09, 2009 చేసిన రాజీనామా సంచలనం రేకెత్తించింది. ఇక అదే రోజు రాత్రి చిదంబరం చేసిన ప్రకటన ఉద్యమాన్ని చల్లార్చింది. నాటి సీఎం రోశయ్య మహిళా దినోత్సవం రోజు నాకు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగి ఇస్తున్నట్టు ప్రకటిస్తే.. నేను రాజీనామాను విత్ డ్రా చేసుకొని డిపార్ట్ మెంట్ లో చేరాను. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే.
Advertisement
18 ఏండ్లు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టు నేను ఎదుర్కొన్నాను. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ లో పోస్టింగ్ ఇచ్చి, నాకు ఛార్జ్ మెమోలు ఇచ్చి ఎక్స్ ప్లనేషన్స్ రాయమనడం అడ్వర్స్ రిమార్క్ రాయడం బ్యాచ్ లో నా ఒక్క దానికే ప్రమోషన్ ను ఆపేయడం ప్రోబేషన్ పీరియడ్ ఎక్స్ టెండ్ చేయడం వంటివి చేశారు. నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు. ఈ విషయాలు అన్నీ నన్ను ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి మొరపెట్టుకునేలా చేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో నాకు అపాయింట్ మెంట్ దొరకలేదు. 01-11-2011న డీజీపీకి రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్లాను. శ్రీ కృష్ణ కమిటీ ప్రభావంతో జరుగుతున్న ఆలస్యాన్ని ప్రశ్నిస్తూ.. నా ఉద్యమ కార్యచరణ ప్రకటించాను. అప్పటి ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది.
అయితే 12 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత తెలంగాణ మూలాలు కలిగిన ఒక ముఖ్యమంత్రిగా మీరు నా కేస్ ను వెలికి తీశారు. చాలా సంతోషం. తెలంగాణ ఉద్యమంలో బ్రతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్లలో నేను ముందు వరుసలో ఉన్నాననే విషయాన్ని ప్రజలకు అర్థం అయింది. నిజం నిలకడగా తెలుస్తుందనేది నిరూపితమైంది. రెండేండ్ల కిందట దేవుడి దయ వల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడు. వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు. నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను. జీవితంలో పది జన్మలకు సరిపడే కష్టాలను పడ్డాను. ప్రస్తుతం వేద ప్రచారకురాలిగా, వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందు ఉన్నటువంటి కర్తవ్యం. చివరగా నేను సీఎం గారిని కోరేది ఏమిటంటే.. నా పై కరుణ చూపి.. నాలా మరే ఆఫీసర్ కూడా డిపార్ట్ మెంట్ లో ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండి. నాకు మీరు న్యాయం చేయాలంటే.. నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులు నా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాను. ప్రస్తుతం సోషల్ మీడియాలో నళిని బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.