Advertisement
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. బాగా తీవ్రత ఉన్న దేశాలు ఆంక్షలు ఎత్తివేసి సాధారణ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. కానీ, మరోసారి డేంజర్ బెల్స్ మోగినట్లు కనిపిస్తోంది. కరోనా పుట్టినిల్లుగా చెప్పే చైనాలో మరోసారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ తీవ్ర అధికం అవుతోంది. దీంతో ఇతర దేశాలు అలర్ట్ అయ్యాయి. చైనా కేసులను నిశితంగా పరిశీలిస్తూ.. తమ దగ్గర అందర్నీ అప్రమత్తం చేస్తున్నాయి.
Advertisement
చైనాలో కేసులు పెరిగిపోవడంతో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. డ్రాగన్ కంట్రీతోపాటు జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, అమెరికా వంటి దేశాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మన దగ్గర కోవిడ్ పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్రం ఉన్నత స్థాయి సమావేశానికి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖలు పంపింది. కొత్త వేరియంట్లను ట్రాక్ చేసేందుకు పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపాలని సూచించింది.
Advertisement
పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపడం వల్ల కొత్త వేరియంట్లను సకాలంలో కనుగొనవచ్చు. దేశంలో కొత్తగా కరోనా కేసులు బయటపడుతున్నాయని తేలిన పక్షంలో ముందుగానే అవసరమైన చర్యలు చేపట్టడానికి వీలు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం.
ఇప్పటికే మన దగ్గర టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్ అనే స్ట్రాటజీతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ విస్మరించకుండా ముందుకు వెళ్తోంది. అంటే.. కరోనా నివారణకు ప్రజలు పాటించవలసిన విధానాలను సూచించడం ఆపలేదన్నమాట. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ వారానికి సుమారు 35 లక్షల కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా తీవ్రత పెరుగుతున్న కారణంగా మనం కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచిస్తోంది.