Advertisement
శ్రీరామ నవమి వేడుకలు.. జనం భారీగా తరలివచ్చారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. కానీ, అంతలోనే ఊహించని ప్రమాదం ఎదురైంది. 13మంది మరణానికి కారణమైంది. ఈ ఘోర విషాదం మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.
Advertisement
ఇండోర్ లో శ్రీరామనవమి సందర్భంగా పటేల్ నగర్ లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. జనం భారీగా తరలివచ్చారు. అయితే.. ఓవైపు స్వామివారి కల్యాణం జరుగుతుండగా.. ఇంకోవైపు మెట్ల బావి పైకప్పు కూలడంతో 30 మందికి పైగా భక్తులు అందులో పడిపోయారు. ఈ ఘటనలో 13 మంది మరణించారు.
Advertisement
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నిచ్చెన, తాళ్ల సాయంతో కొందరు భక్తులను కాపాడి ఆసుపత్రికి తరలించారు. బావి లోతు 50 అడుగులపైనే ఉంది. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
ఆలయ నిర్వాహకులు మెట్ల బావిని వాడకపోవడంతో పైన శ్లాబ్ వేసి వాడుకుంటున్నారు. అయితే.. జనం ఎక్కువమంది రావడంతో పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో మరో 19 మంది సురక్షితంగా బయటపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు ఉన్నట్టు తెలిపారు అధికారులు.
ఈ ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమైన దుర్ఘటన అని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో మాట్లాడానని.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించానని తెలిపారు ప్రధాని మోడీ.