Advertisement
సమయం దగ్గర పడుతోంది.. అందరి చూపు తెలంగాణ భవన్ వైపే. టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ లో ఆయన ఏం మాట్లాడనున్నారు? పార్టీ నేతలకు ఏం చెప్పనున్నారు? ఇలా అనేక ప్రశ్నలపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల నేపథ్యంలో ఏదైనా బ్లాస్టింగ్ న్యూస్ అనౌన్స్ చేస్తారా? అని అంతా అటువైపే చూస్తున్నారు.
Advertisement
మంగళవారం టీఆర్ఎస్‌ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉంది. తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం మొత్తానికి ఆహ్వానం అందింది. మునుగోడు ఉపఎన్నిక తర్వాత మొదటిసారి ఈ సమావేశం జరగనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంకో ఏడాదిలో తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి. ఓవైపు జాతీయ రాజకీయాలు అంటున్నారు కేసీఆర్. ఇలాంటి సమయంలో రాష్ట్రానికి సీఎంగా కొనసాగుతూ పార్టీని విస్తరించడం అంత ఈజీ కాదు. ఈ సమయంలో మీటింగ్ జరగనుండడంతో ఆయన ఏం చెప్పబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.
Advertisement
సమావేశంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని కీలక అంశాలపై కేసీఆర్ చర్చించనున్నట్లు సమాచారం. ప్రధానంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, బీఆర్‌ఎస్ గా ఆవిర్భవించిన తర్వాత పార్టీ యంత్రాంగం ఎలా పనిచేయాలి, పార్టీ కమిటీలు, ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలపై మాట్లాడతారని వినికిడి. అలాగే ముందస్తు ఎన్నికలపైనా చర్చ జరుగబోతోందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఎలాగూ ముందస్తు అనుభవం ఉంది కాబట్టి.. ఏం చేయాలి.. ఎలా చేయాలనే ఓ క్లారిటీ ఉంటుంది. ఆ దిశగా పార్టీ నేతలు, కార్యకర్తలను సెట్ రైట్ చేసి ముందుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారేమో అని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, మునుగోడు విజయంతో దూకుడు మీదున్నారు కేసీఆర్. ఒకవేళ ముందస్తుకు వెళ్తే ఉపయోగం ఉంటుందా? లేదా? అనే అంశంపై నేతలతో చర్చిస్తారట. కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తున్న ఆయన.. వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారని సమాచారం. బీఆర్ఎస్ నుంచి అక్కడ అభ్యర్ధులను బరిలో దించాలని యోచిస్తున్న కేసీఆర్.. టీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేతలకు దీనిపై దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు.