Advertisement
పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను పదవుల్లో భాగస్వామ్యులను చేయడంతో పాటుగా.. వారికి అనుకోని ఆపత్కాల పరిస్థితి ఎదురైతే బీమా సౌకర్యం కల్పించేందుకు పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టింది జనసేన. ఫిబ్రవరి 10 నుంచి 28 వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
Advertisement
ఈ సభ్యత్వం తీసుకున్నవారికి రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, వైద్య ఖర్చులకు రూ.50 వేల వరకు సదుపాయం కల్పిస్తోంది జనసేన. ఈ నేపథ్యంలో 2022-23 సంవత్సర కాలానికి పార్టీ క్రియాశీలక కార్యకర్తల బీమా ప్రీమియంను పవన్ కల్యాణ్ చెల్లించారు. వార్షిక సంవత్సరం ముగిసి కొత్త 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభం కానుండడంతో.. కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు.
Advertisement
హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయంలో కోటి రూపాయల చెక్ ను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు కోశాధికారి ఎంవీ రత్నంలకు అందజేశారు పవన్. పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు, వారికి ప్రమాద బీమా చేయించే నిమిత్తం గత రెండేళ్లుగా ఏటా కోటి రూపాయల చొప్పున విరాళం అందిస్తున్నారు పవన్. ఈ ఏడాది మూడోసారి తన వంతుగా కోటి రూపాయలను అందించారు.
ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాక్షించారు. ఆశయ బలంతో త్రికరణ శుద్ధిగా పని చేసే కార్యకర్తలే జనసేన బలమని చెప్పారు. క్రియాశీలక సభ్యులే జనసేన కోర్ ఓటు బ్యాంక్ అని తెలిపారు. ఈ సభ్యత్వం కార్యకర్తలకు ఇస్తున్న ధీమా అని చెప్పారు. దురదృష్టకర పరిస్థితుల్లో ఎంతోమందికి అండగా నిలిచామని అన్నారు పవన్ కళ్యాణ్.