Advertisement
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది రాజకీయాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీని ఇరుకునపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓవైపు మాటల తూటాలు, మరోవైపు పోస్టర్ల ద్వారా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేయడంలో ఊహించని చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కొందరు గుర్తు తెలియని దుండగులు ఓ దుశ్చర్యకు పాల్పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం లో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు గుర్తు తెలియని వ్యక్తులు సమాధి కట్టారు.
Advertisement
2016లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హోదాలో జేపీ నడ్డా దండు మల్కాపురంలో పర్యటించారు. ఆ సమయంలో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే హామీ ఇచ్చి ఆరేళ్ళు దాటిన ఇప్పటివరకు నెరవేర్చకపోవడంతో ఆ స్థలంలో జేపీ నడ్డాకి సమాధి కట్టారు. మట్టితో సమాధిని ఏర్పాటు చేసి దానిపై జేపీ నడ్డా ఫోటోని పెట్టి.. పూలమాలవేసి పసుపు, కుంకుమలు జల్లి ఇలాంటి దుశ్చర్యకి పాల్పడ్డారు. అయితే ఇది కచ్చితంగా టిఆర్ఎస్ పనే అంటూ బిజెపి ఆరోపిస్తోంది. ఈ చర్య పై కేంద్ర కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. రాజకీయాల్లో అత్యంత దిగజారుడుతనానికి ఇదే నిదర్శనం అని మండిపడ్డారు. “వినాశకాలే విపరీత బుద్ధి” అని ట్వీట్ చేశారు.
Advertisement
ఇక ఇదే విషయంపై కేంద్ర మాంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. బ్రతికున్న వారికి సమాధి కట్టే వికృత, ఉన్మాద చర్యలకు అధికార పార్టీ తెరలేపిందని మండిపడ్డారు. మా సహనాన్ని అసమర్థతగా భావించవద్దని.. మేం తెగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మునుగోడు ఉప ఎన్నికలలో ఓడిపోతున్నాం అనే భయంతోనే టిఆర్ఎస్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ గురించి టిఆర్ఎస్ ఇప్పుడు మాట్లాడుతుంది కానీ.. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ఇక్కడ ఫ్లోరైడ్ నివారణకు తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడు ప్రజలు మంచి తీర్పును ఇవ్వబోతున్నారని.. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. ఇప్పుడే సమాధులు కట్టే దాకా వచ్చిన మునుగోడు పంచాయతీ ఇక మున్ముందు ఎలా ఉండబోతుందో..? అని మునుగోడు ప్రజలు చర్చించుకుంటున్నారు.