Advertisement
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. గెలిచేది తానేనని తెగ ఊదరగొట్టారు. చివరకు 805 ఓట్లతో సరిపెట్టుకున్నారు. అయితే.. ఎన్నిక, ఫలితాల ప్రక్రియ అయిపోయాక కూడా నియోజకవర్గంలో పాల్ సందడి చేస్తున్నారు. ఈ ఎన్నిక సజావుగా సాగలేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.
Advertisement
చండూర్ మున్సిపాలిటీలోని అమరవీరుల స్థూపం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు పాల్. ఉప ఎన్నికలో అవకతవకలు జరిగాయని.. అధికారులంతా కలిసి ఈవీఎంలను ట్యాంపర్ చేశారని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు భారీ అక్రమాలకు పాల్పడ్డాయని.. ఓటర్లను ప్రలోభ పెట్టాయని అన్నారు. పోలింగ్ కు ఈవీఎంలను కాకుండా బ్యాలెట్ పేపర్లను వినియోగించాలని తాము కోరినా అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు.
Advertisement
మునుగోడును దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ చెప్పారని.. ఆయన దత్తత తీసుకోవడమంటే అక్కడున్న భూములను ఆక్రమించడం, అమ్ముకోవడం, లక్షల కోట్లను దోచేయడమేనని ఆరోపణలు చేశారు పాల్. ఉప ఎన్నికను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఈనెల 10వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ కు వేసిన సీల్ మారిందని.. సీసీ కెమెరాలు సంబంధించిన లింక్ తమకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు పాల్. రోజుకో వేషంతో ప్రచారం హోరెత్తించారు. 50 వేల మెజార్టీతో గెలుస్తానని విజయోత్సవ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు. చివరకు ఆయనకు 805 ఓట్లు మాత్రమే వచ్చాయి.