Advertisement
మునుగోడు ఉప ఎన్నిక బరిలో ఉన్న అభ్యర్థుల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఒకరు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి మునుగోడును అమెరికా చేస్తానని ఓటర్లకు గాలం వేస్తున్నారు. ముఖ్యంగా యువతకు రకరకాల స్కీములు ఆఫర్ చేస్తున్నారు. అలాగే తనదైన స్టయిల్ లో ప్రచారంలోనూ వినూత్న పంథాను కనబరుస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు.
Advertisement
మునుగోడు మండల కేంద్రంలో చెప్పులు కుడుతూ కనిపించారు పాల్. అక్కడున్న ఓటర్లకు సరదాగా కబుర్లు చెప్పారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. అమెరికాలో చెప్పులు కుట్టిన అబ్రహం లింకన్ అధ్యక్షుడు అయ్యాడన్నారు. అది అమెరికా గొప్పతనమని.. మనదేశంలో ఇది సాధ్యమా అని ప్రశ్నించారు. చెప్పులు కుట్టుకుని బతికే వారికి రోజుకి 300 రూపాయలు కూడా రావడం లేదన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు.
Advertisement
మాదిగల కష్టాలు తనకు తెలుసని, అందుకే మార్పు తీసుకురావడానికి వచ్చానని తెలిపారు పాల్. మార్పు రావాలంటే తననే సాధ్యమని.. అందుకే ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాంటూ ఓటర్లను అభ్యర్థించారు. టీఆర్ఎస్, బీజేపీ గుండాలు అడుగడుగునా తన ప్రచారాన్ని అడ్డుకుని.. తన పై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. పాల్ చెప్పులు కుట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంతకుముందు ప్రచారంలో డ్యాన్స్ కూడా చేశారు పాల్. రెండురోజుల క్రితం రోడ్ సైడ్ హోటల్ లో దోశలు వేశారు. ఇలా ప్రచారంలో తనదైన స్టయిల్ లో దూసుకెళ్తున్న పాల్ 2019 ఎన్నికల ప్రచారాన్ని గుర్తు చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. అప్పుడు ఏపీలో ఎన్నికల సమయంలో ఇలాగే హడావుడి చేశారని వివరిస్తున్నారు.