Advertisement
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో వెరైటీ గెటప్స్ తో అందర్నీ అలరించారు కేఏ పాల్. రైతు వేషం వేశారు. చెప్పులు కుట్టారు. ఓటర్లకు దోశలు వేశారు. గొర్రెల కాపరి వేషంలోనూ కనిపించారు. ఇలా తనదైన రీతిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. అయితే.. పోలింగ్ సందర్భంగానూ ఆయన హల్ చల్ చేశారు.
Advertisement
ఓ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ కి వెళ్లారు పాల్. అక్కడ కాసేపు ఉండి.. బయటకు వచ్చాక ఉన్నట్టుండి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై మీడియా ప్రతినిధులు ఆయన్ను పలు ప్రశ్నలు వేశారు. చేతినిండా ఉంగరాలతో వచ్చారు.. మీ గుర్తును ఓటర్లకు చెబుతున్నారు.. ఇది కరెక్టేనా? అని అడగగా.. టీఆర్ఎస్ నేతలు కార్లలో తిరుగుతున్నారని.. వారిని సైకిల్ రమ్మంటారా? అంటూ ఎదురు ప్రశ్నించారు.
Advertisement
ఇక ఎందుకిలా పరుగులు పెడుతున్నారని అడగగా.. అదిరిపోయే సమాధానం ఇచ్చారు. తన తరఫున బూత్ ఇంచార్జిలు ఎవరూ లేరట. అందుకే ఒక్కడినే సాయంత్రం 6 గంటల్లోగా కనీసం 100 నుంచి 150 బూత్ లు ఇలాగే పరుగులు పెట్టి తిరుగుతానని చెప్పారు. బీజేపీ వాళ్లు ఓటుకు రూ.3వేలు, టీఆర్ఎస్ వాళ్లు ఇంటికి తులం బంగారం ఇస్తున్నారనే ప్రచారం జరిగిందన్నారు పాల్. ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అక్కడక్కడా చిన్న చిన్న ఘటనలు మినహా అంతా ప్రశాంతంగానే ఉంది.