Advertisement
బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఆయన బయటకొచ్చేశారు. ఓవైపు మోడీపై నమ్మకం ఉందని చెబుతూనే.. తాను పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చిందో వివరించారు. కేవలం సోము వీర్రాజు వల్లే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం నచ్చి బీజేపీలో చేరానని, పార్టీ ఎదుగుదలకు కృషి చేసినందువల్లనే తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి లభించిందని చెప్పుకొచ్చారు.
Advertisement
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 9 నెలల ముందు తనకు అధ్యక్ష పదవి ఇచ్చినా.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలబెట్టానని గుర్తు చేశారు కన్నా. ఆ తర్వాత కరోనా కారణంగా అన్ని రాజకీయ కార్యక్రమాలు మందగించాయని అన్నారు. తాను అంతగా కష్టపడినా.. పక్కన పెట్టి సోము వీర్రాజుకు అవకాశం ఇచ్చారని.. ఆయన అధ్యక్షుడైన తర్వాత తనను, తన వర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అసహనం వ్యక్తం చేశారు.
కన్నా లక్ష్మీనారాయణ చేసిన ఆరోపణలకు బీజేపీ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. సోము వీర్రాజుపై చేసిన ఆరోపణల్ని ఖండించింది. కన్నా రాజీనామా చేసిన తర్వాత పార్టీ పెద్దలతో మాట్లాడారు ఎంపీ జీవీఎల్. అంతకు ముందు మీడియా పదే పదే అడిగినా స్పందించని జీవీఎల్.. పార్టీ నుంచి డైరెక్షన్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ కన్నా తీరును తప్పుబట్టారు. అయితే.. ఇప్పుడు లక్ష్మీనారాయణ ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ జరుగుతోంది.
Advertisement
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఓ వెలుగు వెలిగారు కన్నా. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా తప్పటడుగులు వేశారు. గతంలో వైసీపీలోకి వెళతారని విస్తృత ప్రచారం జరిగినా రకరకాల కారణాలతో అది నెరవేరలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా యాక్టివ్ గానే వ్యవహరించినా అనూహ్యంగా ఆయన స్థానంలో సోము వీర్రాజుకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే భావనలో సైలెంట్ గా ఉండిపోయారు. పార్టీ కార్యక్రమాలకు సైతం అంటిముట్టనట్టుగా ఉంటూ వస్తున్నారు.
ఈమధ్య జనసేన నేత నాదెండ్లతో భేటీ అయ్యారు. దీంతో జనసేన గూటికే వెళ్తారని ప్రచారం సాగుతోంది. నిజానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల జరుగుతున్న సమయంలోనే కన్నాబీజేపీని వీడాలని భావించారు. ఆ సమయంలో బీజేపీ కేంద్ర నాయకుడు స్వయంగా వచ్చి చర్చలు జరపడంతో జాప్యం జరిగింది. చర్చల తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోకవడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇంకోవైపు టీడీపీ నుంచి కూడా లక్ష్మీనారాయణకు ఆఫర్ ఉందనే ప్రచారం సాగుతోంది.