Advertisement
ఒక్కసారి ప్రజలు తిరగబడితే ఎదురుగా ఉన్నది సీఎం అయినా, పీఎం అయినా లెక్క చేయరు. ఓటేసిన చేతులతోనే బడిత పూజ చేస్తారు. దీనికి చక్కటి ఉదాహరణే. చిక్ మంగళూరు ఘటన. ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఒళ్లు హూనమయ్యేలా చావబాదారు.
Advertisement
అసలేం జరిగిందంటే?
చిక్ మంగళూరులో ఏనుగుల బెడద ఎక్కువ. తరచూ గ్రామాలపై పడుతూ పంటంతా నాశనం చేస్తుంటాయి. అయితే.. ఆదివారం ఏనుగు దాడిలో ఓ మహిళ మృతి చెందింది. దీంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి ఎమ్మెల్యే కుమారస్వామి వెళ్లారు. ఆయన్ను చూసి రగిలిపోయిన గ్రామస్తులు తిరగబడ్డారు. పైగా అప్పటికే కోపంతో రగిలిపోతున్న వారి ముందే ఏనుగుల గుంపును ఏం చేయలేమని అన్నారాయన.
Advertisement
ఎమ్మెల్యే మాటలతో ఆగ్రహించిన గ్రామస్తులు ఎమ్మెల్యేపై దుర్భాలాడుతూ కొట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో రాళ్లతో కొట్టారు. వెంటనే ఎమ్మెల్యేను వేరే వాహనంలో అక్కడి నుంచి తరలించారు పోలీసులు. గ్రామస్థులపై లాఠీచార్జీ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏనుగుల సంచారం గురించి ఎంత మొరపెట్టుకున్నా.. ఎమ్మెల్యే వినలేదని గ్రామస్తులు అంటున్నారు. మనిషి చనిపోయిన తర్వాత తీరిగ్గా ఇప్పుడు వస్తారా? అంటూ మండిపడ్డారు.
గ్రామస్తుల బారి నుంచి ఎమ్మెల్యేను రక్షించడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. గ్రామస్తులను అడ్డుకునే క్రమంలో తోపులాట, ఘర్షణ జరిగింది. కొందరికి గాయాలు కూడా అయ్యాయి.ఎమ్మెల్యేకి కూడా స్వల్ప గాయాలయ్యాయి. దుస్తులు చిరిగిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి.