Advertisement
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేసీఆర్ కుమార్తె కవిత పేరు అఫీషియల్ గా బయటకు వచ్చాక ఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. సీబీఐ విచారణకు నోటీసులు ఇచ్చాక ఇది పీక్స్ కు చేరింది. ఈక్రమంలోనే కవిత తన తండ్రిని కలిసి కీలక సూచనలు తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రగతి భవన్ కు వెళ్లిన కవిత.. సీబీఐ నోటీసులపై కేసీఆర్ తో సుదీర్ఘంగా చర్చించినట్టు చెబుతున్నారు. అలాగే.. లీగల్ టీమ్ తోనూ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.
Advertisement
తెలంగాణలో సీబీఐకి ఎంట్రీ లేదు. డైరెక్ట్ అక్కడివాళ్లు ఇక్కడికి వచ్చి విచారణ చేయడానికి వీలు లేదు. రాష్ట్రంలోని సంస్థల సహకారంతోనే చేయాల్సి ఉంటుంది. ఆ ధీమాతోనే ముందు సీబీఐకి ఓకే చెప్పారు కవిత. కానీ, కేసీఆర్ తో భేటీ తర్వాత కొన్ని కండిషన్స్ పెట్టారు. ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ డీటైల్స్ కాపీలు కావాలని సీబీఐకి లేఖ రాశారు. అయితే వివరణ కోసం వచ్చినప్పుడు… వాటిని తీసుకువస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు అవి ఇవ్వకపోతే.. విచారణకు హాజరయ్యేందుకు, తన తరఫున క్లారిఫికేషన్ ఇచ్చేందుకు నిరాకరించే ఛాన్స్ ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Advertisement
కేసీఆర్ తో భేటీ సందర్భంగా లీగల్ టీమ్ తోనూ కవిత చర్చలు జరిపినట్టు సమాచారం. సీబీఐ ప్రశ్నలు ఎలా ఉంటాయి..? వాటికి ఎలా స్పందించాలి? ఏ ప్రశ్నకు ఏం సమాధానం ఇవ్వాలి? ఇలా అనేక విషయాలపై సుమారు 15 మంది లీగల్ టీమ్ తో కవితకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ టీమ్ లో సీనియర్ న్యాయవాదులు, రిటైర్డ్ జడ్జీలు, గతంలో సీబీఐ కేసులను వాదించిన సుప్రీంకోర్టు న్యాయవాదులు ఉన్నట్టు సమాచారం. వీరంతా సీబీఐ అధికారుల నుంచి వచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయో చెపుతూ, వాటికి ఏ విధంగా సమాధానాలు చెప్పాలో కవితకు వివరించినట్టు తెలుస్తోంది.
అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించింది ఈడీ. ఆమె మొత్తం రెండు నెంబర్లతో పది ఫోన్లు వాడినట్లు పేర్కొంది. ఆ ఫోన్ నెంబర్ల IMEI వివరాలతో సహా పూసగుచ్చినట్టు వివరించింది ఈడీ. ఈ ఫోన్ల వ్యవహారంపైనా లీగల్ టీమ్ పలు సూచనలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అన్ని ఫోన్లు ఎందుకు మార్చారని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఆ ఫోన్లను ధ్వంసం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే అడిగితే ఏం చెప్పాలి ? రిమాండ్ లో ఉన్న శరత్ చంద్రారెడ్డి, అమిత్ ఆరోరాతో ఉన్న పరిచయాలపై ప్రశ్నలు అడిగితే ఏం మాట్లాడాలి? ఇలా అనేక విషయాలపై లీగల్ ఎక్స్ పర్ట్స్ కవితకు దిశానిర్దేశం చేశారని సమాచారం. కవిత అడిగినవి సీబీఐ ఇస్తుందా? ఒకవేళ ఇవ్వకపోతే ఆమె ఏం చేయబోతున్నారు? ఇలా పలు ప్రశ్నలతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.