Advertisement
నాలుగు రోజులుగా తెలంగాణ అంతటా ఒకటే చర్చ సాగింది. అదే మొయనాబాద్ ఫాంహౌస్ వ్యవహారం. మునుగోడు బైపోల్ ను సైత పక్కన పడేసి అంతా అటు వైపు చూశారు. దీనిపై కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉండబోతుందనే చర్చ జోరుగా సాగింది. ఇన్ని రోజుల నుంచి ఆయన సైలెంట్ గా ఉండిపోవడం కూడా అనేక అనుమానాలకు తావిచ్చింది. అయితే.. ఎట్టకేలకు కేసీఆర్ నోరు విప్పారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల విషయంలో బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Advertisement
మునుగోడు ఉప ఎన్నిక చివరి అంకానికి చేరుకుంది. ఈ క్రమంలో చండూరులో టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించింది. దీనికి హాజరైన సీఎం.. ఫాంహౌస్ వ్యవహారంలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను స్టేజ్ పై తెగ పొగిడేశారు. అంగట్లో పశువుల్లా అమ్ముడు పోకుండా ఎమ్మెల్యేలు జాతి గౌరవాన్ని కాపాడారని కొనియాడారు. రెండుసార్లు ప్రధానిగా చేసి కూడా మోడీ ఇలాంటి అరాచకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? అంటూ మండిపడ్డారు.
Advertisement
అయినా.. వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయన్న సీఎం.. దీనిపై విచారణ జరగాలని చెప్పారు. దీని వెనుక ఎవరున్నారో తేలాలని తెలిపారు. ప్రభుత్వాలను కూలగొట్టాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. కొంతమంది ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని వచ్చారని.. వంద కోట్లకు ఆత్మగౌరవాన్ని కొందామని చూశారని.. తెలంగాణ అంటే అమ్ముడుపోయేది కాదని చెప్పుతో కొట్టినట్టు నలుగురు ఎమ్మెల్యేలు చెప్పారన్నారు.
మాయమాటలు చెప్పే నాయకులు అధికారంలోకి వస్తే ప్రజల బతుకులు మారవన్నారు కేసీఆర్. న్యాయం, ధర్మం ఏంటో ప్రజలకు తెలుసని.. నిజానిజాలు తేల్చాలని చెప్పారు. ఓటు అనేది తలరాత రాసుకునే ఆయుధం అని.. ఆలోచించి వేయాలని సూచించారు. మునుగోడులో అవసరం లేకుండా వచ్చిన ఉప ఎన్నిక వచ్చిందని చెప్పారు. ఫలితం కూడా ప్రజలు ఎప్పుడో తేల్చేశారని అన్నారు.