Advertisement
బడ్జెట్ సమావేశాలు ముగింపు సందర్భంగా సుదీర్ఘంగా మాట్లాడారు సీఎం కేసీఆర్. ఓవైపు కేంద్రాన్ని విమర్శిస్తూనే.. రాష్ట్ర నేతలను కూడా హెచ్చరించారు. ప్రగతి భవన్ పేల్చేస్తామన్న రేవంత్ కు.. సచివాలయం డోమ్ లు పేల్చేస్తా మన్న బండి సంజయ్ కు తనదైన రీతిలో మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Advertisement
ప్రగతి భవన్ ను పేల్చేస్తే, సచివాలయం గుమ్మటాలను కూల్చేస్తే చూస్తూ ఊరుకుంటామా అని అన్నారు కేసీఆర్. ఇలాంటి పనులు చేయాలనుకునేవారి కాళ్లు, రెక్కలు విరిచి ప్రజలు పడేస్తారని హెచ్చరించారు. వారిని ప్రజలే చూసుకుంటారని చెప్పారు. ఇటీవల రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను బాంబులతో పేల్చేయాలని అన్నారు. పేదోళ్లకు ప్రవేశం లేని ప్రగతి భవన్ వుంటే ఎంత, లేకపోతే ఎంత అని మాట్లాడారు.
Advertisement
మరోవైపు బండి సంజయ్ కొత్త సచివాలయం గుమ్మటాలు కూల్చేస్తామని కామెంట్ చేశారు. తాము అధికారంలోకి వస్తే నిజాం వారసత్వ బానిస మరకలను సమూలంగా తుడిచివేస్తామని అన్నారు. భారతీయ, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సచివాలయంలో మార్పులు చేస్తామని తెలిపారు. ప్రగతి భవన్ ను ప్రజాదర్బార్ గా మారుస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే కేసీఆర్ స్పందిస్తూ.. వారికి హెచ్చరిక చేశారు.
ఇటు ఇప్పటి ప్రతిపక్ష నేతలతోపాటు.. ఒకప్పటి ప్రతిపక్ష నేతలను కలిపి విమర్శించారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమయంలో రాష్ట్రంలో చెరువులు, కాలువలు అన్నీ ఎండిపోయాయని తెలిపారు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో కాల్వలన్నీ 9 నెలలు నిండుకుండల్లా ప్రవహిస్తున్నాయని అన్నారు. తెలంగాణ వాగులో నీళ్లు పారినట్లు, వచ్చే ఎన్నికల్లో తమకు ఓట్లు రాలుతాయని ధీమా వ్యక్తం చేశారు.