Advertisement
ఎట్టకేలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీలో తమ టార్గెట్ ఏంటో.. కార్యాచరణ ఎలా ఉండబోతోందో చెప్పేశారు. ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్ధసారథి, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు గులాబీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ ను రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించినట్లు ప్రకటించారు. అలాగే రావెల ఢిల్లీ కేంద్రంగా వ్యవహారాలు చూసుకుంటారని తెలిపారు.
Advertisement
ఏపీలోనూ బీఆర్ఎస్ కు మంచి స్పందన లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేసీఆర్. సంక్రాంతి తర్వాత అక్కడ ఆఫీసు ఫుల్ బిజీ అవుతుందని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలు బీఆర్ఎస్ మహా యజ్ఞంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి తర్వాత దేశంలోని 7 నుంచి 8 రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఉరుకులు పరుగులు మొదలవుతామని స్పష్టం చేశారు. త్వరలో ఏపీలోకి కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరతారని తెలిపారు.
Advertisement
దేశం మొత్తం రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం అసాధ్యమేమీ కాదన్న కేసీఆర్.. రూ.1.45 లక్షల కోట్లతో ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చని తెలిపారు. బీఆర్ఎస్ కు అధికారమిస్తే దేశం మొత్తం దళితబంధు అమలు చేస్తామన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే నిలిపివేస్తామని.. మోడీ అమ్మినా మళ్లీ ప్రభుత్వంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. మోడీ విధానం ప్రైవేటైజేషన్ అయితే.. తమది నేషనలైజేషన్ అని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర సమరయోధులకు దక్కినంత గౌరవం బీఆర్ఎస్ నేతలకు దక్కుతుందన్నారు.
విద్వేషాలు, మతకల్లోలాలు రెచ్చగొట్టి కొందరు గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు తెలంగాణ సీఎం. ఢిల్లీలో రైతులు కొన్ని నెలలపాటు ఆందోళన చేశారని.. వ్యవస్థీకృతంగా పనిచేస్తేనే దేశాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. అన్ని రకాల పంటలకు అనుకూలమైన నేలలు దేశంలో ఉన్నాయని పేర్కొన్నారు. గొంతు చించుకుని కొందరు మేక్ ఇన్ ఇండియా నినాదం ఇస్తున్నారని.. కానీ, చిన్న పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా చైనా నుంచి వస్తున్నాయని విమర్శించారు. దేశంలో వీధివీధికి చైనా బజార్లు ఏర్పడ్డాయని.. మేక్ ఇన్ ఇండియా నిజమైతే అన్నెందుకు పుట్టుకొచ్చాయని ప్రశ్నించారు.