Advertisement
రాహుల్ గాంధీ అనర్హత, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్, రైతులకు నష్టపరిహారం సహా పలు అంశాలపై ఎంపీ కోమటిరెడ్డి భువనగిరిలో మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ఏదో ఫ్లోలో మాట్లాడారని అన్నారు. ఎవరినీ ఉద్దేశించి అనలేదని.. ప్రచార సభలలో దేశంలో జరుగుతున్న సంఘటనలను ఉదాహరణగా చెప్పారని తెలిపారు. దీనిపై కిందిస్థాయి కోర్టు రెండేళ్లు జైలుశిక్ష విధించినా.. వెంటనే బెయిల్ ఇచ్చి పైకోర్టుకు వెళ్లడానికి అవకాశం ఇచ్చిందన్నారు. గతంలో ఎంతో మందికి కింది కోర్టులో శిక్ష పడితే.. పైకోర్టుల్లో స్టే తెచ్చుకున్నారని తెలిపారు.
Advertisement
కోర్టు సమయం ఇచ్చినా లోక్ సభ సచివాలయం తొందరపడిందన్న కోమటిరెడ్డి.. ఓ నెల ఆగితే పోయేదేముందన్నారు. 24 గంటల లోపే అనర్హత వేశారని.. దేశం కోసం తండ్రిని, నాయనమ్మను కోల్పోయిన రాహుల్ కు ఇచ్చే గౌరవం ఇదేనా? అని అడిగారు. రాహుల్ గాంధీ అనర్హత నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఆయన.. ఇప్పటికే అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టామని.. న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ చివరి వరకు నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిందని.. ఇంకా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయని వివరించారు.
Advertisement
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ తో నిరుద్యోగులకు అన్యాయం చేశారన్న కోమటిరెడ్డి.. 9 ఏళ్లుగా 70వేల టీచర్ల పోస్టులు ఖాళీ అయితే డీఎస్సీ నోటిఫికేషన్ వేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ప్రతీ రెండేళ్లకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు. డీఎస్సీకి సంబంధించిన నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారని.. గ్రూప్స్ పోస్టులకు ఇవ్వకఇవ్వక నోటిఫికేషన్లు ఇస్తే లీక్ చేసి వారి భవిష్యుత్తుపై దెబ్బకొట్టారని అన్నారు. గతంలో ఇంటర్ పరీక్షల స్కాంకు పాల్పడ్డ గ్లోబరేనా సంస్థకే గ్రూప్స్ పరీక్షలు అప్పజెప్పారని.. ఈ సంస్థ వల్ల ఎంతోమంది విద్యార్థుల చావుకు గురయ్యారని చెప్పారు. అలాంటి సంస్థకే అంతా అప్పజెప్పి 30 లక్షల మంది పిల్లల భవిష్యత్ ను నాశనం చేశారని ఆరోపించారు.
ఈ ప్రభుత్వానికి కనీసం పేపర్లు దిద్దడం రాదు.. ఖాళీల పోస్టులు భర్తీ చేయడం రాదు.. యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీని భర్తీ చేయడం రాదు.. అంటూ నిప్పులు చెరిగారు. పేపర్ లీకేజ్ పై సీబీఐ ఎంక్వైరీ వేయాలన్న కోమటిరెడ్డి.. దీనిపై హోంమంత్రిని కలబోతున్నట్టు చెప్పారు. టీఎస్సీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి ఆఫీసర్ గా మంచి పేరున్నా.. ఇప్పుడు ఆ పరువంతా పోయిందన్న ఎంపీ.. స్వచ్ఛందంగా రాజీనామా చేసి జరిగింది జరిగినట్టు బయటపెట్టాలని హితవు పలికారు.
వడగళ్ల వానకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయన్న కోమటిరెడ్డి.. వాటిని పరిశీలించి దీక్షలు చేశామని తెలిపారు. ఆ తర్వాతే సీఎం ఎకరానికి 10వేలు ప్రకటించారని అన్నారు. కానీ, ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఏమాత్రం సరిపోదని స్పష్టం చేశారు. 24 గంటల ఉచిత కరెంట్ ఎక్కడిస్తున్నారని ప్రశ్నించిన వెంకట్ రెడ్డి. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. థాక్రే నేతృత్వంలో అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నామని.. టికెట్ల విషయంలో సర్వే చేయించి ఇస్తారని అన్నారు. రాహుల్ గాంధీ అంశంతోపాటు ఇతర ప్రజాసమస్యలపై పోరాటం సాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.