Advertisement
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై మండిపడ్డారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆలేరు నియోజకవర్గం గుండాల మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ మాట-ముచ్చట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుండాల మండలాన్ని తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని తెలిపారు. ఈసారి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని.. అందరం కలిసికట్టుగా పార్టీని గెలిపించుకుందామని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వం అన్నింటా ఫెయిల్ అయిందని.. పరీక్షలు జరిపించడం రాదు.. పేపర్లు దిద్దడం రాదని మండిపడ్డారు.
Advertisement
నియోజకవర్గాల్లో ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదన్న కోమటిరెడ్డి.. పలు కారణాలతో కొందరు చనిపోతే.. వారి కుటుంబసభ్యులను పలకరించని ఎమ్మెల్యేలు, మంత్రులు అవసరమా? కనీసం పలకరించాలన్న మానవత్వం లేదా? అని ప్రశ్నించారు. 15 రోజుల క్రితం మంత్రి గంగుల కమలాకర్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నామని చెప్పారని.. ఇప్పటికీ చాలాచోట్ల కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయన్నారు. వర్షాలకు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీళ్లపాలు అవుతోందని తెలిపారు.
గుండాలకు దగ్గరలో ఉన్న ధాన్యం కొనుగోలు సెంటర్ లో వర్షాలకు పంటంతా తడిసిపోతోందన్న కోమటిరెడ్డి… పటేల్ గూడెంలో కూడా అదే పరిస్థితి నెలకొందని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వంలో చేతగాని మంత్రులు ఉన్నారని.. ‘‘రైతుల పక్షాన చేతులెత్తి దండం పెడుతున్నాం… భారత్ రాష్ట్ర సమితి కాదు.. ప్రపంచ రాష్ట్ర సమితి పెట్టినా మాకు అభ్యంతరం లేదు.. కానీ, వడ్ల సంగతి తేలాలి. కష్టపడి రైతులు పంట పండిస్తే కొనుగోళ్ల జాప్యం కారణంగా వర్షం పాలవుతోంది’’ అని మండిపడ్డారు.
Advertisement
కేసీఆర్.. ఔరంగాబాద్ కాదు.. ఓసారి పక్కనే ఉన్న ఛత్తీస్ గఢ్ వెళ్లి రావాలని సూచించారు వెంకట్ రెడ్డి.. అక్కడ మార్కెట్ లోకి వచ్చిన 24 గంటల్లోనే క్విటాల్ ధాన్యం రూ.3వేల కొనుగోలు చేస్తున్నారని చెప్పారు.ఇది నిజం కానట్టయితే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. నిజమైతే నీ మంత్రి చేత రాజీనామా చేయించు.. నువ్వు ఎలాగూ చేయవు కదా అని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చత్తీస్ గఢ్ లో క్విటాల్ వడ్లు 3వేల రూపాయలతో కొంటుంటే.. కాంగ్రెస్ పార్టీని తిడతావా? రైతు సోదరులారా దీన్ని గమనించండని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు కోమటిరెడ్డి. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే అందిస్తామని హామీ ఇచ్చారు. ఏక కాలంలోనే రుణమాఫీ చేస్తేనే రైతుకు ఉపయోగం ఉంటుందని.. గతంలో తమ పాలనలో అది చేసి చూపించామని గుర్తు చేశారు. కేసీఆర్ చేసే కొద్దికొద్ది రుణమాఫీ వల్ల ఉపయోగం లేదని.. బ్యాంక్ వాళ్లు వడ్డీ కింద జమచేసుకుంటున్నారని చెప్పారు. భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర రంగారెడ్డి, భువనగిరి, నల్గొండ మీదుగా ఖమ్మం వెళ్తుందన్న కోమటిరెడ్డి ఆలేరులో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. 4 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని.. ఈసారి ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్న నమ్మకం ఉందన్నారు. తమ ప్రభుత్వం రాగానే క్వింటాల్ ధాన్యాన్ని 3 వేల రూపాయలకు కొంటామని హామీ ఇచ్చారు.