Advertisement
ఈటల రాజేందర్ వ్యాఖ్యల నేపథ్యంలో సవాల్ చేసినట్టే రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా కన్నీరు పెట్టుకుంటూ ఈటలపై ఘాటుగా స్పందించారు. అయితే.. రేవంత్ పై బీజేపీ నేతల ఎటాక్ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. తీవ్ర స్థాయిలో రేవంత్ పై మండిపడ్డారు.
Advertisement
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, రేవంత్ రెడ్డి మధ్య చీకటి వ్యాపారాలు ఉన్నాయని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ ప్రజలందరికీ రేవంత్ గత చరిత్ర తెలుసునని అన్నారు. ఆయనకు బ్లాక్ మెయిలర్ అనే పేరు ఉందని వ్యాఖ్యానించారు. రేవంత్ వేల కోట్లు దోచుకున్నారని, ఇప్పుడు భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేస్తానని చెబితే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలకు డబ్బులు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుక్కోవడం రాజకీయ వ్యభిచారం కాదా? అని ప్రశ్నించారు రాజగోపాల్ రెడ్డి. ఓటుకు నోటు కేసులో నోట్ల కట్టలతో రెడ్ హాండెడ్ గా దొరికి జైలుకు వెళ్లిన నీ చరిత్ర రాజకీయ వ్యభిచారం కాదా? అని నిలదీశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 25 కోట్లు కాంగ్రెస్ కు ముట్టాయని.. అందులో 10 కోట్లు రేవంత్ నొక్కేసారని కాంగ్రెస్ నేతలే అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారన్నది వాస్తవం కాదా? అని అడిగారు.
Advertisement
మునుగోడులో బీజేపీ గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పతనమవుతుందని, అందుకే తనను ఓడించేందుకు బీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని రేవంత్ రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారని విమర్శించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక, ఎలాంటి ఆధారాలు లేకుండా 18 వేల కోట్లకు అమ్ముడుపోయానని దుష్ప్రచారం చేశారని.. దానిపై ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని.. లేదంటే తాను వేసే పరువు నష్టం కేసులో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.
మరోవైపు రేవంత్ వ్యాఖ్యలపై ఈటల స్పందించారు. తన నివాసం నుంచే మీడియాతో మాట్లాడుతూ.. తాను ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నానని.. వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ధర్మం కోసం, ప్రజల కోసం అలా మాట్లాడానని తెలిపారు. తాను ఎదుటివారిని కించపరిచే వ్యక్తిని కాదన్నారు. రాజకీయ నాయకుడు ఎప్పుడైనా కాన్ఫిడెంట్ గా ఉండాలని.. నీ మీద నీకు నమ్మకం లేకపోతే కదా దేవుడిపై విశ్వాసం అని అన్నారు. అయ్యతోడు, అమ్మతోడు ఇదేమి కల్చర్ అంటూ ఎద్దేవ చేశారు ఈటల రాజేందర్.