Advertisement
సంచలనం రేపిన శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ ఘటనను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డారు. దోషులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు. గురువారం శ్రీచైతన్య కాలేజీ దగ్గరకు వెళ్లిన కోమటిరెడ్డిని పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఆయన వారి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. విద్యార్థి మృతికి కారణమైన వారిని అదుపులోకి తీసుకుని.. రాత్రికి రాత్రే ఎలా వదిలేస్తారని ప్రశ్నించారు.
Advertisement
సూసైడ్ నోట్ లో సాత్విక్ చెప్పిన వారందరినీ అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి. నిందితులను కోర్టులో హాజరుపర్చే వరకు తాను కళాశాల నుంచి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. అక్కడే కూర్చుండిపోయారు. శ్రీ చైతన్య యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి.. కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సాత్విక్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు దీక్ష ఆగదని స్పష్టం చేశారు.
Advertisement
ఇటు శ్రీచైతన్య కళాశాలకు ప్రభుత్వం పోలీసులతో భద్రతను కల్పించడంపై కోమటిరెడ్డి ఫైరయ్యారు. కళాశాలకు 30-40 మంది పోలీసులు భద్రతగా మోహరించి ఉన్నారని, దీని అర్థం ఏంటని నిలదీశారు. ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడేలా వేధింపులకు గురి చేసిన కళాశాల యాజమాన్యం, సిబ్బందిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని అడిగారు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యాలకు పోలీసులు అమ్ముడుపోయినట్లు ఉందని ఆరోపించారు.
ఈ సందర్భంగా ఏపీలో జరిగిన సంఘటనలను గుర్తు చేశారు కోమటిరెడ్డి. పేపర్ లీకేజీ కేసులో అక్కడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాహసోపేత నిర్ణయాలను తీసుకున్నారని, మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేయించారని గుర్తు చేశారు. పనికిరాని విషయాల మీద ట్విట్టర్ లో మాట్లాడే కేటీఆర్ ఈ విషయంపై ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు కోమటిరెడ్డి.