Advertisement
మంచిర్యాలలో కాంగ్రెస్ నిర్వహించిన జై భారత్ సత్యాగ్రహ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేతోపాటు టీపీసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే సహా ఇతర నేతలు హాజరయ్యారు. రాహుల్ గాంధీ అనర్హతను నిరసిస్తూ.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో భాగంగా ఈ సభను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisement
భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సభలో పాల్గొని ప్రసంగించారు. ముందుగా భారతరత్న, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పించారు. రాహుల్ గాంధీని అన్యాయంగా, అక్రమంగా అనర్హుడిగా ప్రకటించారని మండిపడ్డారు. కోర్టు గడువు ఇచ్చినా డిస్ క్వాలిఫై చేసి ప్రజాస్వామ్యం లేదని నిరూపించారని విమర్శించారు. రాహుల్ గాంధీ దేశం కోసం నాయనమ్మను, తండ్రిని కోల్పోయారని గుర్తు చేశారు. రెండుసార్లు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా కూడా వద్దన్నారని తెలిపారు.
అనర్హత వేటు పడినా కూడా ధైర్యంగా తనకి పదవి కాదు.. ప్రజలు ముఖ్యమని రాహుల్ గాంధీ చెప్పారని అన్నారు కోమటిరెడ్డి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించుకుందాం.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి రుణం తీర్చుకుందామని పిలుపునిచ్చారు. ‘‘రెండు నెలలుగా కేసీఆర్ తీరును గమనించండి.. మహారాష్ట్ర నాయకులతో మీటింగ్ పెడతాడు.. ఒడిశా నాయకులతో మీటింగ్ పెడతాడు.. కర్ణాటక నాయకులతో మీటింగ్ పెడతాడు.. తెలంగాణలో ఏం జరుగుతుందో పట్టించుకోడు’’ అంటూ విమర్శించారు.
Advertisement
వడగళ్ల వాన వచ్చి రైతులు నష్టపోతే పట్టించుకోలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఆత్మీయ సంబరాలు అంటూ.. బిర్యానీలు, బీర్లు పొంగిస్తున్నారని.. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో జనం చనిపోయారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే.. దేశాన్ని ఏలతాడట.. తెలంగాణ బంగారుమయం ఎక్కడయింది..? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. సింగరేణి విషయంలో పది వేల కోట్లు తీసుకున్నాడో లేదో కేసీఆర్ ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రాన్ని దోచేసి దేశ రాజకీయాలు అంటూ కేసీఆర్ తిరుగుతున్నారని.. ఇతర పార్టీల ఎన్నికల ఖర్చు భరించే స్థాయికి బీఆర్ఎస్ చేరిందంటే.. ఆయన దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కాదు.. నీ కేబినెట్ లో ఎంతమంది దళితులకు పదవులు ఇచ్చావని కేసీఆర్ ను ప్రశ్నించారు. భట్టి విక్రమార్కని చూస్తుంటే రాజశేఖర్ రెడ్డి గుర్తుకొస్తున్నారన్నారు కోమటిరెడ్డి. అచ్చం ఆయనలాగే ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారని.. చెట్టుకిందే మీటింగులు పెడుతున్నారని తెలిపారు. మహిళలు, రైతులు అన్ని వర్గాల వారిని కలుస్తున్నారన్నారు. పదవులు ముఖ్యం కాదు.. తెలంగాణ బాగుండాలని అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.